జగపతిబాబు తన ఫ్యాన్స్‌పై హర్టయ్యారు. కొందరు ఫ్యాన్స్ తన నుంచి అభిమానం, ప్రేమ కంటే కూడా ఆశించడం ఎక్కువైందని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అందుకే ఇక నుంచి అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కి ఉన్న సంబంధాన్ని విరమించుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ లేఖను చూస్తుంటే.. జగపతిబాబును ఎవరో బాగా హర్ట్ చేశారనేది మాత్రం అర్థమవుతోంది. ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేసిన లేఖలో ఏముందంటే..
అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్య కారణంగా భావించాను. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాలలో పాల్గొని, వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి, వాళ్లు నాకు తోడుగా ఉంటే.. వాళ్లకి నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు.
మనసు ఒప్పుకోకపోయినా.. బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కి ఉన్న సంబంధాల నుంచి విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి, జీవించనివ్వండి.. అంటూ జగపతిబాబు.. అభిమానులకు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన లేఖలో పేర్కొన్నారు.