ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో రియాక్ట్ అవుతున్నారు. వుయ్ ఆర్ విత్ సిబిఎన్ అంటూ చంద్రబాబుకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ.. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మాత్రం చంద్రబాబుకు ఎటువంటి మద్దతు లభించలేదు. టాలీవుడ్‌కి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా చేశారు. ఆయనంటే ఎంతో గౌరవం ఉన్నట్లుగా ఇండస్ట్రీలోని అందరూ ప్రవర్తిస్తుంటారు. కానీ ఆయన కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరూ రియాక్ట్ కాలేదంటూ ప్రేక్షకులు, నెటిజన్లు కొందరు ఈ మధ్య రాద్దాంతం చేశారు.. చేస్తున్నారు. దీనిపై నిర్మాత సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ పార్టీలన్నింటితో మంచి సంబంధం ఉంటుంది. ఏ ఒక్కరికో ఇక్కడ మద్దతు ఇవ్వడం అనేది ఉండదు. అందుకే ఈ విషయంలో టాలీవుడ్ నుంచి ఎవరూ రియాక్ట్ కాలేదని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇదే విషయాన్ని ఏపీ మీడియా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ప్రస్తావించింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై మళ్లీ సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి వీలు లేకుండా.. ఎందుకు సినిమా వాళ్లు కామ్‌గా ఉన్నారో కన్విన్సెంగ్‌గా పవన్ క్లారిటీ ఇచ్చారు.
‘‘సినిమా పరిశ్రమ అనేది వండర్‌ఫుల్ ఇండస్ట్రీ. ఇలాంటి విషయాలలో సినిమా ఇండస్ట్రీ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్పందించడానికి సినిమా వాళ్లు భయపడతారు. గతంలో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా పాలిటిక్స్ పరంగా సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. కృష్ణ, ప్రభాకర్ రెడ్డి.. వంటి వారంతా ఎన్టీఆర్‌గారి టైమ్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ప్రతి పార్టీకి సినిమా ఇండస్ట్రీ నుంచి బేసిక్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడది వైసీపీకి కూడా ఉండవచ్చు. నాకు సపోర్ట్ ఉందని చెప్పలేను. అలాంటి దృష్టితో కూడా నేను ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీని చూడలేదు. సినిమా ఇండస్ట్రీ అనేది పొలిటికల్ పార్టీ కాదు. ఇందులో 24 శాఖల వారు పని చేస్తూ ఉంటారు. వారు పొలిటికల్ హీట్‌ని తట్టుకోలేరు. వాళ్లకి వంద సమస్యలు ఉంటాయి. వాళ్ల బాధని నేను అర్థం చేసుకోగలను. అలా అని వారు ఇలాంటి విషయాలలో బాధపడటం లేదా.. వారికి ఎలాంటి అభిప్రాయం లేదా అని అనలేం.
ఒకవేళ ఎవరైనా ధైర్యంగా వచ్చి మాట్లాడితే.. వాళ్లని వైసీపీ వాళ్లు టార్గెట్ చేసి ఇబ్బందులు పెడతారు. అది రీసెంట్‌గా రజనీకాంత్‌గారి విషయంలో చూశాం. ఒక సీనియర్ యాక్టర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అశేష ప్రజాభిమానం కలిగిన వ్యక్తి అయిన సూపర్ స్టార్ రజనీకాంత్‌గారు.. తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు గురించి నాలుగు మాటలు మాట్లాడితే.. ఎలా తిట్టారో చూశారు కదా! ఆయనని తిట్టని తిట్టు లేదు. అలాంటి వ్యక్తినే అలా చేస్తే.. ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు వైసీపీ వాళ్ల నోటిలో పడాలని ఎందుకు అనుకుంటారు. నేను మొండివాడిని కాబట్టి ధైర్యంగా మాట్లాడాను. ఎందుకంటే నేను ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నాను కాబట్టి నాకు ఆ కెపాసిటి ఉంది. ఒకవేళ నేను కూడా కేవలం సినిమాలలోనే ఉండి ఉంటే.. ఎంత వరకు మాట్లాడగలిగేవాడినో నాకూ తెలియదు. కాబట్టి.. ఫిల్మ్ ఇండస్ట్రీని ఈ విషయంలో మినహాయించాలని కోరుతున్నాను..’’ అని జనసేన చీఫ్ మీడియాకు చెప్పుకొచ్చారు.