ఒక ఆసక్తికర పరిణామానికి ఏపీ వేదికగా మారింది. బాబాయిని హత్య చేసిన నిందితులేమో దర్జాగా బయట తిరుగుతున్నారు. సీబీఐ వేస్తున్న పిటిషన్లన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. తప్పు చేసినట్టు ఎక్కడా రుజువేలేని టీడీపీ అధినేత చంద్రబాబు ఏమో ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారో తెలియని పరిస్థి. విచారణ కొనసాగుతూనే ఉంది. డైలీ సీరియల్ మాదిరిగా కేసు కోర్టుకు రావడం వాయిదా వేయడం జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి అక్టోబర్ 19 వరకు రిమాండ్ ఉన్నా.. తర్వాతేంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది. వెంటనే బయటకు వస్తారనుకున్న చంద్రబాబు జైలుకు వెళ్లి దాదాపు నెల అవుతోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసు సెప్టెంబర్ 9న బాబు అరెస్ట్ దగ్గర్నుంచి ఇప్పటిదాకా అనేక మలుపులు తిరిగింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టు జడ్జి.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషయన్ కస్టడీ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడి నుంచి మొదలు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. రెండు రోజుల పాటు విచారణ తర్వాత క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ వెంటనే చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇక హైకోర్టు చంద్రబాబు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడాన్ని ఆయన తరుఫు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు సుప్రీంలో డివిజన్ బెంచ్ ముందుకు వచ్చింది. అక్కడ జడ్జిలిద్దరూ ‘నాట్ బిఫోర్ మీ’ అనేశారు. ఆ వెంటనే చంద్రబాబు తరుఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సీజేఐని ఆశ్రయించి వాదనలు వినిపించారు. ఇక్కడ కేసు విచారణ అక్టోబర్ 3కి వాయిదా పడింది. 3న విచారణ జరిగి అక్టోబర్ 9కి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏపీ నుంచి హస్తినకు చేరింది. రెండు చోట్ల విచారణ జరుగుతోంది. వాయిదా పడుతోంది. పోనీ చంద్రబాబు తరుఫున ఏమైనా పేలవమైన వాదలున్నాయా? అంటే.. ఆయన తరుఫున సుప్రీంకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయవాదులంతా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయినా కూడా విచారణ కొలిక్కి రావడం లేదు. చివరికి శుక్రవారం అయినా చంద్రబాబు కేసుల విచారణ కొలిక్కి చేరుతుందని అంతా భావించారు. కానీ తిరిగి సోమవారానికి వాయిదా పడింది. ఇక ఈ కేసులే తీరానికి చేరడం లేదంటే చంద్రబాబును జీవితకాలం జైల్లో పెట్టడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ రకరకాల కేసులను ఆయనపై మోపుతోంది. అసలు చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనేది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.