తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రెండు విధాలుగా చూడవచ్చు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌కు ముందు.. రేవంత్‌కు తర్వాత. అంతకు ముందున్న నేతలు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెచ్చిన పార్టీగా.. క్రెడిట్ సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారనడంలో సందేహం లేదు. రేవంత్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఏమీ వెంటనే చక్కబడలేదు. ఎన్నో సమస్యలు. సీనియర్స్ అంతా వ్యతిరేకించారు. దేనికీ కలిసి రాలేదు. చాలా తిప్పలు అయితే పడ్డారు. ఒకానొక సందర్భంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నేతలంతా కాస్త సెట్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చారు.
ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. కర్ణాటకలో ఏ స్ట్రాటజీ అయితే వర్కవుట్ అయ్యిందో దానినే తెలంగాణలోనూ వర్కవుట్ చేసేందుకు శ్రమిస్తోంది. ఓవైపు అభ్యర్థుల ఎంపికను చివరి దశకు తీసుకొస్తూనే.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెడుతోంది. ఫీలింగ్స్ అన్నీ పక్కనబెట్టేసి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలని డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని నేతలకు క్లియర్‌గా చెబుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్స్ చేసే సిఫార్సులను లెక్కపెట్టడం లేదని సమాచారం. ముఖ్యంగా టీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే ఆధారంగా టికెట్ల కేటాయింపు జరుగుతోందని సమాచారం.
మొత్తానికి ఇప్పుడు టీకాంగ్రెస్ సీనియర్స్‌లో తమకు టికెట్ వస్తుందా? రాదా? అన్న భయం పట్టుకుందట. విజయంపై అనుమానాలు ఏమైనా ఉంటే.. మరోసారి ఏఐసీసీ ఫ్లాష్ సర్వేలు చేయిస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్లాష్ సర్వేల కోసం మూడు బృందాలు రంగంలోకి దిగాయని టాక్. గతంలో అయితే సీనియర్స్ ఎవరి పేరు చెబితే వారికే టికెట్ కేటాయించేవారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బొక్కబోర్లా పడింది. ఈసారి మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో సర్వేలు నిర్వహించినా కూడా 500 మాత్రమే శాంపిల్స్‌తో సరిపెట్టేది కానీ ఇప్పుడు మూడు వేల వరకూ శాంపిల్స్ సేకరిస్తున్నట్టు సమాచారం. అన్నీ క్షణ్ణంగా పరిశీలించాకే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేస్తుందని సమాచారం.