బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ విషయాన్ని స్వయాన ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ జాతీయ మీడియాకు వెల్లడించారు. కేసీఆర్‌కు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో, ఇప్పుడు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల బాస్ కోలుకోవడానికి అనుకున్న టైమ్ కంటే మరింత ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. గత మూడు వారాలకుపైగా జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్‌కు ప్రగతి భవన్‌లోనే.. యశోద ఆస్పత్రి నుంచి వచ్చిన ఐదుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్లు కూడా కేటీఆరే స్వయంగా ట్వీట్ చేసి చెప్పారు. దీంతో ఇప్పటి వరకూ కేబినెట్ సమావేశం, జిల్లాల వారీగా జరగాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం అన్నీ వాయిదా వేయాల్సి వచ్చింది.
ఎక్కడ చూసినా జ్వరాలే..!
కాగా.. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వైరల్ జ్వరాలు తీవ్రంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో ఈ వైరల్ జ్వరాలకు సంబంధించిన కేసులు భారీగా నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం. జలుబు, దగ్గు, ఫీవర్, ఫుడ్ పాయిజనింగ్, వాంతులు ..ఇలా అనారోగ్య కారణాలతో చిన్నా, పెద్దా అందరూ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. రోగులతో స్థానిక పీహెచ్‌సీలు నిండిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఈ నెల రోజులుగా వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయని వైద్యులు చెబున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆందోళన!
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో బీఆర్ఎస్‌లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఎవరూ ఊహించని రీతిలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ఎన్నికల ప్రచారంలో తనదైన మార్క్ చూపించాలని, ప్రతిపక్షాలకు తానేంటో చూపించాలని చాలానే వ్యూహ రచనే చేశారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మొత్తం రివర్స్ అవ్వడంతో బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందని పార్టీ శ్రేణులు కంగారుపడుతున్న పరిస్థితి. వాస్తవానికి మూడు వారాలుగా తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గవర్నర్ తమిళిసై ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడం, ఒక్కొక్కరుగా అసంతృప్తులంతా కాంగ్రెస్ గూటికి చేరిపోతూ ఉండటం, ఇంకా నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ పెండింగ్‌లోనే పెట్టడం, ఇప్పటికే పలువురు సిట్టింగులు కూడా ‘కారు’ దిగి.. ‘చేయి’ కిందికి చేరిపోవడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్న పరిస్థితి. దీంతో కాంగ్రెస్‌లో చేరికలను అయితే బీఆర్ఎస్ పెద్దలు ఆపలేకపోతున్నారనే టాక్ మాత్రం గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌కు అన్నీ తామై.. పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులన్నింటినీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చూసుకుంటూ వస్తున్నారు. మరోవైపు.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ శ్రేణులు పూజలు చేస్తున్న పరిస్థితి.