తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నేడో రేపో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నలుగురు మినహా అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ ప్రకటించేసింది. నిజానికి ప్రకటించిన సమయంలో అయితే తాంబూలాలిచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టుగానే బీఆర్ఎస్ అధినేత వైఖరి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పుడున్నట్టుగా ఇప్పుడుంటే కలవదు. బీఆర్ఎస్ నుంచి కీలక వికెట్స్ అన్నీ ఢమాలున పడిపోతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి గట్టు దాటడంతో ప్రారంభమైన జంపింగ్స్ నేటికీ ఆగడం లేదు. మైనంపల్లి, తుమ్మల, కసిరెడ్డి, ఇప్పుడు మనోహర్ రెడ్డి, రేఖా నాయక్ తదితర బడా నేతలంతా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
బీఆర్ఎస్‌లోకి కూడా వస్తున్నారు కానీ అంతా చోటా నాయకులే. పోయేదేం బడా నేతలు కావడంతో ఏమాత్రం సెట్ కావడం లేదు. తుమ్మల, కసిరెడ్డి, మనోహర్ రెడ్డిలను పార్టీలోనే ఉంచాలని కేసీఆర్ చేసిన యత్నాలేవీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. తొలుత పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయాలని భావించిన కేసీఆర్‌కు ప్రస్తుత పరిణామాలు బీభత్సంగా షాక్ ఇస్తున్నాయి. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం ఎన్నికల వేళ గులాబీ బాస్‌ను కలవర పెడుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ చాలా స్ట్రాంగ్‌గా తయారవుతోంది. చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించే ర్యాలీలకు నో చెప్పడంతో దాదాపు సెటిలర్స్ అంతా రివర్స్ అయ్యారు.
ఇక అటు బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం మాంచి జోష్ మీదుంది. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షే లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించి.. వారితో సంప్రదింపులు జరిపి.. సమావేశాలు నిర్వహించి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇది బీఆర్ఎస్‌కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. అసలు ఇలా ఇంకెంతమంది పార్టీని వీడుతారో అన్న భయం కూడా బీఆర్ఎస్‌కు పట్టుకుంది. ఈ క్రమంలోనే నాయకులను చేజారి పోకుండా ఒడిసి పట్టుకుంటోంది. నామినేటెడ్ పదవుల ఆశ చూపిస్తోంది. కానీ నేతలు పార్టీలు మారుతూ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతమేరకు గులాబీ బాస్‌ను నమ్మి పార్టీలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గులాబీ బాస్ తలిచిందొకటైతే.. జరుగుతోంది మాత్రం మరొకటి.