దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఆయన తీస్తున్న సినిమాలు ఒకదానిని మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తున్నాయి. రీసెంట్‌గా కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమా తీసి రికార్డులు క్రియేట్ చేసిన లోకేష్.. ఇప్పుడు ఇలయదళపతి విజయ్‌తో లియో అనే చిత్రం చేశారు. ఈ సినిమా దసరా స్పెషల్‌గా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత లోకేష్.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు లోకేష్ తన సినిమాల సీక్వెల్స్ ప్లాన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇలాంటి దర్శకుడి మేనేజర్ నుంచి కాల్ వస్తే.. అందులోనూ మీకు యాక్టింగ్ ఛాన్స్ అంటే.. ఒక్కసారిగా ఆకాశంలో విహరించడం ఖాయం.
అలా విహరించే లోపే.. ఆ కాల్ చేసిన వ్యక్తి మీ ఖజానా ఖాళీ చేయడం తధ్యం. షాకయ్యారా? అవును.. ఇదొక పెద్ద స్కామ్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేనేజర్‌ని కాల్ చేస్తున్నాను. మీ ఫ్రొఫైల్ నచ్చి మీకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. మీరు ఆడిషన్‌కు వచ్చే ముందు కాస్ట్యూమ్స్ రెంట్ నిమిత్తం కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆడిషన్స్ తర్వాత మళ్లీ మీ అమౌంట్ రిటన్ అవుతుందంటూ బురిడీ కొట్టించే బ్యాచ్ దిగిపోయినట్లుగా.. తాజాగా నటుడు బ్రహ్మాజీ తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.
స్కామ్ చేయాలనుకునే వాడు అనేక మార్గాలను ఎన్నుకుంటాడు. అందులో ఇదొకటి. జర జాగ్రత్త అంటూ బ్రహ్మాజీ తన ట్విట్టర్ వేదికగా అందరినీ అలెర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ అకౌంట్‌లో ఓ నెంబర్ పెట్టి.. ఆ నెంబర్ లోకేష్ కనగరాజ్ మేనేజర్‌ది.. అంటూ జరిగిన విషయం చెప్పుకొచ్చాడు. అయితే ఈ కాల్‌కి నువ్వు కూడా కనెక్ట్ అయ్యావా అన్నా.. అంటూ నెటిజన్లు బ్రహ్మాజీ ట్వీట్‌కు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిని సరదాగా తీసుకోవద్దు. ఇలాంటి కాల్స్ కారణంగానే.. చాలా మంది రోడ్డున పడ్డవారు ఉన్నారు. సో.. జర జాగ్రత్త!