కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం నేడో రేపో ఖాయం అన్నట్టుగా అనిపిస్తోంది కానీ అవడం లేదు. ఈ సారి మాత్రం ఫిక్స్ అనే మాటే వినిపిస్తోంది. వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విలీన నిర్ణయానికి సెప్టెంబర్ 30 వ తేదీ గడువు పెట్టుకున్నారు. ఆలోపు ఏదో ఒక నిర్ణయం రాకుంటే ఒంటరిగా ఎన్నికలకు వెళతామన్నారు. ఈ లోపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. ఆమె నేడో రేపో ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథే. అయితే కొత్తగా షర్మిల పదవులకు సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇది నిజంగా జరిగితే మాత్రం షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు ఏమాత్రం రిగ్రెట్ ఫీలవ్వాల్సిన అవసరం లేదంటున్నారు.
ఇంతకీ ఏంటా పదవి అంటారా? నిజానికి షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ ఏపీ వినియోగించుకోవాలని భావించింది. దీనికి షర్మిల అంగీకరించలేదు. ఇక షర్మిల తనకు ఖమ్మం జిల్లా పాలేరు టికెట్ కోరారు. కానీ అక్కడి స్థానం నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు లేదంటే రెడ్డి సామాజిక వర్గం పాలేరులో ఎక్కువ కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో షర్మిలకు అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించలేదు. ఇక మధ్యేమార్గంగా ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే షర్మిల హస్తిన పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
షర్మిలను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను ఢిల్లీకి ఆహ్వానించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే షర్మిల నో చెప్పకుండా ఆమెకు ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించిందట. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి అంటే ఒకరకంగా ప్రియాంక గాంధీకి సమానమైన పదవి. ఇది నిజమే అయితే పాలేరు టికెట్ పోతే పోయింది కానీ జాతీయ స్థాయిలోచక్రం తిప్పే అవకాశం షర్మిల దక్కించుకున్నట్టే. దీంతో వైఎస్సార్‌టీపీ క్యాడర్ కూడా ఏమాత్రం నిరుత్సాహానికి గురవదు. ఖమ్మం లోక్‌సభకు అయితే షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక చూడాలి ఏం జరుగుతుందో..