టైటిల్ చూసి.. ఏంటి ప్రధాని మోదీ పొలిటీషియన్ కాదా? అనుకునేరు. పొలిటీషియనే కానీ ఏది పడితే అది మాట్లాడలేని పొలిటీషియన్. ఆయన పదవికి ఒక గౌరవం ఉంది. ఏదో ఒక పార్టీ నేత మాదిరిగానో.. కార్యకర్త మాదిరిగానో గుడ్ కాల్చి ఎదుటోడి నెత్తిన వేయడానికి వీలు లేదు. ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి. తాజాగా ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం సభలో ప్రసంగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అవి కాస్తా హాట్ టాపిక్‌గా మారాయి. మోదీ చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అవుతున్నాయో.. మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటన్నది కూడా అంతే వైరల్ అవుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని.. తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని తాను ఎన్డీఏకు సపోర్ట్ చేస్తానని చెప్పారని మోదీ తెలిపారు. అలాగే కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారని మోదీ వెల్లడించారు. ప్రజలు ఆశీర్వదిస్తే పాలకులవుతారని చెప్పానని మోదీ వెల్లడించారు. ఎవరైనా నేతలు పార్టీ మారాక ఆంతరంగిక విషయాలను బయటపెడతారు. కానీ మోదీ ఏంటి ఇలా మాట్లాడారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి బీజేపీ నాయకుడు ఎవరో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. పైగా ప్రధాని స్థాయిలో ఆయన ప్రసంగం సాగి ఉన్నా అంతా లైట్ తీసుకునేవారు.
తెలంగాణలో కేసీఆర్‌ను వీక్ చేయాలనుకున్నారో ఏమో కానీ మొత్తానికైతే ఒక సాధారణ నేత మాదిరి ఆరోపణలు చేశారు. పోనీ ఈ ఆరోపణలో బీజేపీకి వచ్చే మైలేజ్ ఏమైనా ఉందా? అంటే జీరో. బీజేపీ అసలు ఎప్పుడో తెలంగాణలో మూడో స్థానానికి పడిపోయింది. పైగా మోదీ మాటలు.. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయి. అసలే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది. మరోవైపు చేరికలు కూడా బీభత్సంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్‌ను వీక్ చేద్దామనుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చినట్టేగా అని బీజేపీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. అసలు ఇలాంటి ఆంతరంగిక విషయాల జోలికి మోదీ వెళ్లకుంటే బాగుండేదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరి మోదీ స్ట్రాటజీ ఏంటనేది తెలియాల్సి ఉంది.