సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 9కి వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ నిర్వహించింది. చంద్రబాబు వర్సెస్ ఏపీ సీఐడీ తరుఫున వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. చంద్రబాబు తరుఫున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ తదితర ప్రముఖ న్యాయవాదులు వినిపించారు. కెవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైన ఏపీ ప్రభుత్వం.. తన వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించింది. ఇక హైకోర్టు తీర్పులో 17Aను తప్పుగా అన్వయించారని హరీష్ సాల్వే పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధం..
చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించిందన్నారు. హైకోర్టు తీర్పులో మాత్రం చంద్రబాబు ఆదేశాలు.. అధికార విధుల్లో భాగంగా ఇచ్చినట్లు పేర్కొన్నారన్నారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని హరీష్ సాల్వే ధర్మాసనానికి వివరించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకుందని తెలిపారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైతే అప్పటి నుంచే 17A వర్తిస్తుందన్నారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదని.. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని తెలిపారు. 2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్‌లు అన్నింటికీ 17A వర్తిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైందన్నారు. సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా... కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగాయని హరీష్ సాల్వే కోర్టుకు వివరించారు.
కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోంది..
చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు.. సీఐడీ ఒక్క ఆధారం చూపలేకపోయిందని మను సింఘ్వీ తెలిపారు. ఒకదాని వెంట ఒకటిగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారన్నారని సాల్వే అన్నారు. సుదీర్ఘ కాలం చంద్రబాబును జైల్లో ఉంచాలనే.. కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోందని సిద్దార్థ్ లూథ్రా స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ.. చంద్రబాబుకు 17A వర్తించదన్నారు. 2018లో 17A సవరణ జరిగిందన్నారు. ఈ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు ముకుల్ రోహత్గీ వివరించారు. 2018కి ముందు నేరాలకు 17A వర్తించదని.. ఎలా చెప్తారని ముకుల్‌ను జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ముందున్న అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.