ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టుగా అయింది బీఆర్ఎస్ పరిస్థితి. ఏదో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో తన సత్తా చాటుతారేమోలే అనుకుంటే.. తెలంగాణపైన ఫోకస్ పెట్టారు. తమ పార్టీ పోటీ చేయబోయే స్థానాలపై కూడా స్పష్టతనిస్తున్నారు. ఏపీలో తేల్చడం.. తెలంగాణలో చీల్చడమే పనిగా పెట్టుకున్నారు పవన్. ఏపీలో వైసీపీకి అయితే అల్టిమేటం జారీ చేశారు. ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్‌కి ఇన్‌డైరెక్టర్‌గా అల్టిమేటం జారీ చేసేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 32 స్థానాల్లోల పోటీ చేసేందుకు జనసేన సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఎన్నికల బరిలోకి దిగడానికి సన్నాహాలు కూడా ప్రారంభించింది.
అటు ఏపీలో వారాహి యాత్రను సైతం పవన్ ప్రారంభించారు. ఇటు పోటీకి సన్నద్ధం కావాలంటూ తెలంగాణ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. వారాహి యాత్రలో భాగంగా వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వైసీపీని కట్టడి చేస్తామని చెబుతున్నారు. ఈ మద్య వైసీపిని తిట్టడంలేదని..ఎందుకంటే ఓడిపోతున్నవాళ్లని చూసి జాలిపడుతున్నానని చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఈ తరుణంలో జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవడం తెలంగాణ పొలిటిక్స్‌ను హీటెక్కించేస్తోంది. పవన్ విజయం సాధిస్తారా? లేదా? అనే విషయం పక్కనబెడితే ఓట్లు చీల్చడమైతే ఖాయం.
ఏపీలో ఓట్లు చీలకుండా ఉండటమే లక్ష్యంగా టీడీపీతో పొత్తుకు సిద్ధమైన జనసేన.. తెలంగాణలో మాత్రం ఓట్లు చీల్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే తెలంగాణ పార్టీ నాయకులతో సమావేశమై పోటీ చేసే స్థానాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే 32 స్థానాలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వాటిలో కూకట్‌పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరువు, సనత్ నగర్, ఉప్పల్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వరావుపేట, సత్తుపల్లి, పాలేరు, ఇల్లందు, మధిర, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, మునుగోడు, హుస్నాబాద్, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్ గిరి, ఖానాపూర్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. జనసేన వల్ల ఓట్లు చీలి ఏ పార్టీకి నష్టం చేకూరుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం కానీ మొత్తమ్మీద బీఆర్ఎస్‌కు మాత్రం పక్కలో బల్లెంలా జనసేన తయారైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.