ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో.. ఇంత వరకు క్లారిటీ లేదు. ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా రామ్ చరణ్‌కు గాయం అవడంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా విషయం అలా ఉంటే.. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ చేసే చిత్రం కూడా కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్‌సి16 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
RC16కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఇంట్రస్ట్‌ని కలగజేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ విషయంలో.. ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్‌తో జతకట్టిన రామ్ చరణ్.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ యంగ్ బ్యూటీతో జతకట్టబోతున్నట్లుగా తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? ఒకప్పటి బాలీవుడ్ అగ్ర కథానాయికగా పేరొందిన రవీనాటాండన్ కుమార్తె రాషా థడానీ బాలీవుడ్ ఎంట్రీతో పాటు ఈ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాషా థడానీని RC16 కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఆమె లుక్ టెస్ట్ కోసం ఇటీవల హైదరాబాద్ కూడా వచ్చారనేలా టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గ్రామీణ క్రీడా నేపథ్యం చుట్టూ అల్లుకున్న హృద్యమైన ప్రేమగాథగా ఈ సినిమాను బుచ్చిబాబు మలుస్తున్నారు.