అల్లు అరవింద్‌ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎలా చూస్తారో తెలియంది కాదు. ఆయనది మాస్టర్ మైండ్. నేటి తరం ఆలోచనలను అందుకోవడానికి ఆయన మైండ్ ఎలా పని చేస్తుందో అనే దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మచ్చుకు ఒకటి చెప్పుకోవాలంటే ఆహా ఓటీటీనే. మొన్నటి వరకు ఈ మైండ్ ‘మెగా’ కోసం పనిచేస్తే.. ఇప్పుడు ‘అల్లు’ ప్రతిష్టను పెంచే పనిలో ఉన్నట్లుగా ఆయన కార్యకలాపాలు ఉన్నాయి. ఇందుకు ఆయన ఎంచుకున్న వ్యక్తి మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జునే.
అల్లు అర్జున్ కీర్తి రోజురోజుకు పెరగడానికి కారణం.. వెనుకు ఉన్న ఈ మాస్టర్ మైండే. అది అందరికీ తెలియకపోయినా.. ఇండస్ట్రీలోని కొందరికి తెలుసు. ఇప్పుడాయన ఇండస్ట్రీలో అల్లు మార్క్‌ను ప్రదర్శించడానికి ప్రతి నిత్యం పని చేస్తున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పటి వరకు టాలీవుడ్ హీరోకి రాని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్‌కి వచ్చిందంటే.. ఆలోచన, ప్లానింగ్ అంతా ఎవరిదై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో తెలియడానికి ఇప్పుడు మరో ఉదాహరణ ఏమిటంటే..
అల్లు అర్జున్ చక్రం తిప్పుతుండగానే.. ఇప్పుడాయన ఫోకస్ తర్వాత తరంపై పెట్టారు. ఇప్పటికే బన్నీ కుమార్తె, కొడుకుల పేర్లు ఇండస్ట్రీలో వినబడుతున్నాయంటే.. తర్వాత తరాన్ని ఆయన ఎలా రెడీ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్‌గా AAA సినిమాస్ థియేటర్‌ని అల్లు అరవింద్ పక్క నుండి మరీ తన కొడుకు అల్లు అర్జున్‌తో లాంచ్ చేయిస్తే.. తాజాగా, తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్ నటులు కీర్తి శేషులు పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకుని జూబిలీ హిల్స్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు అయాన్ స్పీచ్ వింటే.. రాబోయే తరానికి కూడా అల్లు ఫ్యామిలీ అద్భుతమైన ప్లానింగ్‌లో ఉందనేది ఇట్టే తెలిసిపోతుంది.
ఇంతకీ అల్లు అయాన్ ఏం మాట్లాడాడంటే.. అల్లు రామలింగయ్య తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా.. ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయని చెప్పుకొచ్చాడు. అల్లు అయాన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో కూడా అల్లు అరవింద్ పక్కనే ఉన్నారు. సో.. దీనిని బట్టి అల్లు ప్రతిష్టపై అరవింద్ ఎలా ఫోకస్ పెట్టారో క్లియర్‌గా తెలిసిపోతుంది.