ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పొలిటికల్ మార్పులు చాలా జరిగాయి. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు అంశాన్ని అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇరు పార్టీల మధ్య ఎలాంటి కీలక భేటీ జరగలేదు. మరి చంద్రబాబుతో ములాఖత్ సమయంలో ఏమైనా సీట్ల సర్దుబాటు అంశంపై కూడా చర్చ జరిగిందో లేదో కూడా తెలియదు. ఇక తాజాగా పవన్ మరోసారి వారాహి యాత్రను నిర్వహించబోతున్నారు. పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ చేపట్టబోయే తొలి పొలిటికల్ స్టెప్ కావడంతో ఆయన యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యాత్రలో పవన్ ఏ అంశంపై మాట్లాడతారు? ప్రస్తుత పరిణామాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నిన్న మొన్నటి వరకూ షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. ప్రస్తుతం వారాహి యాత్రతో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అవనిగడ్డ వేదికగా నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వారాహి యాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబుతో పొత్తు ప్రకటించిన తర్వాత పనవ్ మీడియా ముందుకు వచ్చింది లేదు. అసలు దాదాపు పొలిటిక్స్ గురించి మాట్లాడిందే లేదు. ఇప్పుడు లోకేష్‌కి సైతం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై పవన్ మాట్లాడుతారా? లేదా? బీజేపీ కూడా తమతో కలిసొస్తుందని ఆశిస్తున్నట్టు చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ చెప్పారు. కానీ బీజేపీ దీనిపై కనీసం స్పందించింది కూడా లేదు. జనసేన ప్రస్తుత నిర్ణయంపై హస్తినకు పిలిచి చర్చలు నిర్వహించింది కూడా లేదు. మరి దీనిపై పవన్ స్పందిస్తారా.. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ వారాహి యాత్రకు హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మద్దతు ప్రకటించారు. అలాగే నారా లోకేష్ సైతం జనసేన కార్యకర్తలకు మద్దతుగా నిలవాలని తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పవన్ వారాహి యాత్రకు పెద్ద ఎత్తున జనం హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ యాత్ర గ్రాండ్ సక్సెస్ అయితే మాత్రం వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామమే అని చెప్పాలి. ఒకరకంగా విపరీతంగా జనం హాజరైతే మాత్రం పవన్ తన భవిష్యత్ కార్యాచరణ్ ప్రకటించినట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి పవన్‌కు ప్రస్తుత వారాహి యాత్ర మాత్రం చాలా కీలకం. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలపైనే రాజకీయ భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.