తాజాగా టీడీపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు తెలంగాణలో పనేంటంటూ ప్రేలాపనలు.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఐటీ ఉద్యోగులే కాదు.. ఎవ్వరూ ధర్నాలు చేయకూడదంటూ హుకుం జారీ చేశారు. అనుమతులు ఇవ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిరసన ర్యాలీలకు అనుమతివ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనకు కాల్ చేశారని.. శాంతి భద్రతల సమస్య కారణంగా అనుమతిచ్చేదే లేదంటూ డాబులకు పోయారు. మరి ఇక్కడి సెటిలర్స్ ఊరుకుంటారా? ఒక్క కమ్మ సామాజికవర్గమే కాదు.. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల సెటిలర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. అసలు జాతీయ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కంటే దారుణంగా వ్యవహరించడమేంటని అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అసలే ఎన్నికల తరుణం.. పైగా కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా పుంజుకుంటోంది. ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇలాంటి తరుణంలో ఏ ఒక్కరి నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నా నష్టమేనని కేటీఆర్ భావించారో ఏమో కానీ దిద్దుబాటు చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టారు. తన షెడ్యూల్‌లో లేకున్నా కూడా కావాలని ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. తెలుగు వారికి గుర్తింపు తెచ్చిందే ఎన్టీఆర్ అని.. రాముడు, కృష్ణుడు అంటే మనకు గుర్తొచ్చేది కూడా ఎన్టీఆరేనన్నారు. తారక రామారావు.. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందన్నట్టుగా చెప్పుకొచ్చారు. తన తండ్రి కేసీఆర్.. ఎన్టీఆర్ శిష్యుడని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్ భజన అయితే చేసేశారు. ఇక మరోవైపు మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. ఈ వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వీరిద్దరి మాటలను విన్న తెలంగాణ వాసులు షాక్ అవుతున్నారు. ఇంతలోనే ఎంత మార్పు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి బావాబావమరుదులు డ్యామేజ్ కంట్రోల్‌కి బాగానే కష్టపడ్డారు.