ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గతంలో ఏమో కానీ ఈ సారి పార్టీ పూర్తిగా పతనానికో లేదంటే కాస్తైనా కోలుకోవడానికో ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. రేరపు మోదీ మహబూబ్‌నగర్ రానున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఒక భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇవన్నీ పక్కనబెడితే బీజేపీ అసంతృప్త సీనియర్లు మాత్రం కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. బీజేపీలో ఉండటమా? లేదంటే మరో పార్టీకి జంప్ చేయడమా? అనేది రేపటి మోదీ పర్యటనతో తేల్చుకునే అవకాశం ఉంది. ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన నేతల్లో విజయశాంతితో పాటు.. కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
బండి సంజయ్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత పార్టీ చాలా వరకూ కుదేలైంది. ఇప్పటికే కొందరు సీనియర్లు వెళ్లిపోయారు. మిగిలిన వారు రేపటితో తేల్చుకోనున్నారు. మొత్తానికి దీనికంతటికీ కారణం అధిష్టానమేనని అందరికీ తెలిసిందే. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఒకరిద్దరు మినహా బీజేపీ నేతలెవరూ గెలిచే అవకాశమే కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీలోని సీనియర్లకు ఈ విషయం అవగతమైనట్టు టాక్. ఈ క్రమంలోనే పక్క చూపులు చూస్తున్నారు. ఒకప్పుడు దక్షిణాదిలో పక్కాగా అధికారంలోకి వస్తామనుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అలాంటి తెలంగాణలోని పార్టీ సీనియర్లకు అధిష్టానం కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పైగా ఇవన్నీ చాలవన్నట్టు.. ఇటీవల అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు కూడా అసంతృప్త నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కనీసం వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో మాత్రమే భేటీ అయి వెళ్లిపోయారు. ఆ సమయంలో సీనియర్లు మరింత మనస్తాపానికి గురయ్యారు. రేపు మోదీ వస్తున్నారు. ఆయన అయినా అపాయింట్‌మెంట్ ఇచ్చి సీనియర్లకు వారు కోరిన హామీలేమైనా ఇస్తారో లేదంటే ఆయన కూడా వారిని పక్కనపడేసి వెళ్లిపోతారో చూడాలి. పక్కన పడేసి వెళ్లిపోతే మాత్రం సీనియర్లు చాలా మంది పక్కాగా పార్టీకి దూరమైనట్టే. దగ్గరకు తీసి ఏమైనా హామీలిస్తే మాత్రం పార్టీకి వారంతా చేయూతనిచ్చి పార్టీని తెలంగాణలో నిలబెట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. లేదంటే పార్టీ పతనం కన్ఫర్మ్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇప్పుడు బాల్ మోదీ కోర్టులో ఉంది. ఏం చేస్తారో చూడాలి.