చంద్రబాబు అరెస్ట్‌పై నటుడు, దర్శకుడు రవిబాబు తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సినిమా వాళ్ల గ్లామర్ గానీ, రాజకీయ నాయకుల పవర్ కానీ.. ఏదీ శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడుకి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కావు. ఎన్టీఆర్‌గారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడుగారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా ఆప్తులు. బాగా కావాల్సిన వారు. చంద్రబాబుగారి గురించి చెప్పాలంటే.. ఆయన ఏదైనా పని చేసే ముందు, వంద యాంగిల్స్ చూసి.. అందరినీ సంప్రదించి.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా డెసిషన్ తీసుకునేవారు. ఆయనికి భూమి మీద ఇవాళే లాస్ట్ డే అని తెలిసినా కూడా.. కూర్చుని రాబోయే 50 సంవత్సరాల సోషల్ డెవలప్ గురించి ప్లాన్ చేస్తారు.
డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. మరి అలాంటి చంద్రబాబుగారిని సరైన ఆధారాలు కూడా లేకుండా.. జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు చాలా సహజం. కానీ 73 ఏళ్ల వయసున్న పెద్దాయనని జైల్లో పెట్టి హింసించడం.. ఎత్తో, పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం. అశాశ్వతమైన పవర్ ఉన్న వారికి నా హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే.. మీరు ఏ పవర్‌ని అయితే వాడి ఆయనని జైల్లో పెట్టారో.. దయచేసి అదే పవర్‌ని ఉపయోగించి ఆయనని వదిలేయండి.
మీరు చిటికెస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు. ఆయనని బయట ఉంచి.. మీ ఇష్టం వచ్చినట్లుగా ఇన్విస్టిగేషన్ చేసుకోండి. ఆయన ఖచ్చితంగా ఈ దేశాన్ని వదిలి అయితే పారిపోడు. ఆలోచించండి.. చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని అనుకుంటున్నారు. కక్షతో రగిలిపోయే కసాయి వాళ్ల లాగానా? లేకపోతే జాలి మనసు, మోరల్స్ ఉన్న మంచి నాయకుడిలాగానా? దయచేసి చంద్రబాబు నాయుడుగారిని వదిలిపెట్టేయండి. నాలాగా ఎంతో మంది మీ పట్ట కృతజ్ఞతతో ఉంటారు. నమస్తే.. అని రవిబాబు ఈ వీడియోలో పేర్కొన్నారు.