తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. దక్షిణాదిలో పక్కాగా గెలిచేందుకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా గతంలో అంటే కర్ణాటక ఎన్నికల ముందు వరకూ బీజేపీ భావిస్తూ వచ్చింది. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఎందుకోగానీ తెలంగాణలో కూడా కుదైలైంది. ఈ తరుణంలో అధిష్టానం నిర్ణయాలు పార్టీని పూర్తిగా పతనం అంచుకు చేర్చాయి. గత ఏడాది ఒక వెలుగు వెలిగిన బీజేపీ.. ఈ ఏడాది అమావాస్య చంద్రుడిలా తయారైంది. ఎన్నికలకు సరిగ్గా ముందు ఇలా బొక్కబోర్లా పడటం బీజేపీ శ్రేణులకు ఇబ్బందికరంగా తయారైంది. అసలే పరిస్థితి దిగజారితే రాష్ట్ర చీఫ్‌గా ఉన్న బండి సంజయ్‌ను మార్చేసి పార్టీని పాతాళానికి తోసేసింది అధిష్టానం.
బండి సంజయ్ చీఫ్‌గా ఉన్న సమయంలో వరుస కార్యక్రమాలతో పార్టీ నేతల్లో విశ్వాసం పెరిగింది. కానీ ఆయనను తొలగించి కిషన్‌రెడ్డిని చీఫ్‌గా చేశాక పార్టీ ఉందా? లేదా? అన్నట్టుగానే ఉంది. బీఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యర్థి బీజేపీయే అనుకున్న భావన నుంచి అసలు బీజేపీ రాష్ట్రంలో ఉందా? అనుకునే పరిస్థితి వచ్చేసింది. మరోవైపు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బీభత్సంగా పెరిగాయి. కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్ హవా పార్టీలో పెరిగిపోయింది. ఈ పరిణామాలన్నీ ఇతర నేతలకు పెద్దగా రుచించలేదు. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. పోనీ కిషన్ రెడ్డి ఏమైనా తెలంగాణలోని సమస్యలపై పెదవి విప్పుతారా? అంటే అదీ ఉండదు. అసలు ఆయన రాష్ట్రంలో ఉన్నా లేనట్టే.
క్రమేపీ బీజేపీపై జనాల్లో ఆదరణ కూడా తగ్గిపోతోంది. ఇక ఆదరణ తగ్గిందంటే బీజేపీ పూర్తిగా బలహీనపడినట్టే కదా. అంతా బాగానే ఉంది కానీ అన్యాయమవుతోంది మాత్రం ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు, కేడరే. ఇప్పుటికిప్పుడైతే తెలంగాణలో మోదీ, అమిత్ షాల చరిష్మా కానీ.. హిందూత్వ నినాదం కానీ, బీజేపీ సిద్ధాంతాలు ఏవీ వర్కవుట్ కావు అనడంలో సందేహంలో లేదు. పార్టీని చేజేతులా అధిష్టానమే నాశనం చేసింది. ఇప్పుడు ఎన్ని చేసినా పునర్వైభవం కష్టం. ఈ క్రమంలో అసంతృప్త నేతలంతా ఇప్పటికే రహస్య మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. వీరంతా కూడా ఏ క్షణమైనా పార్టీ మారే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఇక తెలంగాణలో బీజేపీ భూ స్థాపితమైనట్టే.