ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఊహించని టర్న్ తీసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం.. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వస్తున్న వార్తల నడుమ మరో ఆసక్తికర విషయం వెలుగు చూస్తోంది. చంద్రబాబుకు ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకడం లేదు. గత 20 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీకి దిక్కెవరంటే అందరి కళ్లు నారా బ్రాహ్మణి వైపే చూస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా బ్రాహ్మణి హైలైట్ అవుతున్నారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సైతం బ్రాహ్మణిని ముందు పెట్టి టీడీపీని నడిపిస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ఏనాడూ రాజకీయాల గురించి మాట్లాడని బ్రాహ్మణి.. తాజాగా యాక్టివ్ అవుతున్నారు. ఇదే క్రమంలో అయ్యన్న అన్నట్టుగా టీడీపీని ముందుండి నడిపిస్తారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌కు సంఘీభావం తెలిపే క్రమంలో రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, ఐటీ ఉద్యోగులు బ్రాహ్మణిని కలుస్తున్నారు. వ్యాపారపరంగా అయితే ఆమె 100 శాతం సక్సెస్. కానీ రాజకీయాలు? నిజానికి ఆమె బ్లడ్‌లోనే రాజకీయం ఉంది కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె వచ్చింది ఇప్పటి వరకూ లేదు. ఇప్పుడు టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ సమయంలో పార్టీ శ్రేణులను బ్రహ్మణి ముందుండి నడిపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
నారా భువనేశ్వరి సైతం చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాలపై మాట్లాడుతున్నారు. ఆమె కూడా జనాన్ని చక్కగా ఆకట్టుకుంటున్నారు. కానీ బ్రాహ్మణి అయితే యూత్ అంతా ఆమెతో కలిసి వచ్చే అవకాశం ఉంది. యూత్ కలిసొస్తే చాలు.. రాజకీయాలన్నీ తారుమారవుతాయి. అందుకే బ్రాహ్మణిని టీడీపీ హైలైట్ చేస్తోందని టాక్. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై సైతం ఆమె విమర్శలు గుప్పించారు. మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు జనసేన నేతలు సైతం బ్రాహ్మణిని కలుస్తున్నారు. తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు. అధికార పార్టీ సైతం ప్రస్తుత టీడీపీ పరిణామాలను ఆసక్తిగా తిలకిస్తోందట. నిజానికి బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకొస్తారని అధికార పార్టీ సైతం ఊహించలేదు. మొత్తానికి బ్రహ్మణి అయితే ఏపీ పొలిటిక్స్‌ను ఓ మలుపు తిప్పబోతున్నారనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.