తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. వచ్చే నెలలో ఎన్నికల నగారా మోగనుందని సమాచారం. పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇక బీజేపీ అయితే ఏకంగా అధిష్టానాన్ని రంగంలోకి దింపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌లో ఏకంగా రెండు సార్లు పర్యటించబోతున్నారు. అక్టోబర్ 2న మహబూబ్ నగర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఆయన ఒక్కరే కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇక నుంచి పలువురు కేంద్రమంత్రుల తరచూ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇదంతా ఓకే కానీ తెలంగాణ తర్వాత ఏపీ ఎన్నికలు కూడా జరగనున్నాయి కదా.
తెలంగాణలో ఎన్నికలు ముగిసీ ముగియక ముందే ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. మరి తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా బీజేపీ అధినాయకత్వం పర్యటించగలదా? ఏపీని సర్వనాశనం చేయడంలో ప్రధాన భూమిక పోషించింది బీజేపీ. ప్రత్యేక హోదా అన్నది లేదు ప్యాకేజ్ అన్నది.. విశాఖ రైల్వే జోన్.. పోలవరం.. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మేయడం.. మోదీయే స్వయంగా వచ్చి భూమి పూజ చేసిన అమరావతి జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నా చూస్తూ కూర్చోవడం.. ఏపీ అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా.. మరిన్ని అప్పులిచ్చి పాతాళానికి తోసేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి? సవాలక్ష ఉన్నాయి. ఇదంతా బీజేపీ ఘనతే.
ఇదంతా చాలదన్నట్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తుంటే ప్రధాని మోదీ మిన్నకుండి పోయాయి. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. అసలు ఇదంతా జగన్‌తో ఏకమై మోదీ, అమిత్ షాలే చేశారన్న టాక్ కూడా ఏపీలో నడుస్తోంది. పైగా టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని.. బీజేపీ కూడా కలిసి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియా ఎదుట చెప్పినా కూడా బీజేపీ అధిష్టానం సైలెన్స్. ఆయనను హస్తినకు పిలిపించి మాట్లాడింది కూడా లేదు. దీంతో జనసేనాని తీవ్ర అసహనంలో ఉన్నారని సమాచారం. ఇంత విద్వేషాన్ని కక్కి.. ఎన్నికలనగానే మోదీ ద్వయం ఏపీలో పర్యటించగలదా? జనం చూస్తూ ఊరుకుంటారా? ఇవన్నీ చూస్తుంటే మోదీ, అమిత్‌షాలు ఏపీలో పర్యటించడం కష్టమేనని జనంలో చర్చ జరుగుతోంది.