వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం ఏంటనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఫిక్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఈ నెల 30 టార్గెట్ అంటున్నారు. ఆ లోపు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారట. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరకుంటే ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒంటరిగా పోటీ చేస్తే.. గత ఎన్నికల్లో ఏపీలో జనసేన పరిస్థితే వైఎస్సార్‌టీపీకి పడుతుందా? అనే సంశయం నెలకొంది. షర్మిల మాత్రం ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరకుంటే అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారట.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా సోనియాగాంధీతో కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనానికి రాయబారం నడిపారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు కూడా చేశారు. తొలుత ఈ వ్యవహారమంతా సానుకూలంగానే నడిచింది. కానీ ఆ తరువాత ఏమైందో తెలియదు. ఉన్నట్టుండి విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. వాస్తవానికి డీకే శివకుమార్‌కు ట్రబుల్ షూటర్‌గా మంచి పేరే ఉంది. అయినా కూడా ఆయన రాయబారం ఎందుకు ఫలించలేదో తెలియడం లేదు. నిజానికి ఏపీ సీఎం జగన్‌పైనే ఆయన సోదరి అయిన షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయోగించాలనుకుంది. కానీ షర్మిల మాత్రం తాను తెలంగాణకే పరిమితమని.. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టబోనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సైలెంట్ అయిపోయినట్టు టాక్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రస్తుతం బలంగా ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరికతో ఆ పార్టీ మరింత స్ట్రాంగ్ అయ్యింది. ఈ తరుణంలో షర్మిల పాలేరు సీటు అడిగారని తెలుస్తోంది. అది తుమ్మలకు ఫిక్స్ అయిపోయింది. ఆయనను కాదని షర్మిలకు ఇవ్వడం సాధ్యపడదు. షర్మిలకు ఇదొక మైనస్. అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత రేణుకా చౌదరి వంటి కీలక నేతలు సైతం షర్మిల చేరికకు అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత కాదన్నా కూడా షర్మిల ఏపీకి చెందిన వ్యక్తే. పైగా ఏపీ సీఎం జగన్‌కు స్వయానా చెల్లెలు. గత ఎన్నికల్లో మాదిరిగా ప్రాంతీయతత్వాన్ని అధికార పార్టీ రెచ్చగొట్టిందో కాంగ్రెస్ చేజేతులా అధికారాన్ని దూరం చేసుకోవడమే అవుతుంది. ఇవన్నీ ఆలోచించి హస్తం పెద్దలు షర్మిలను దూరం పెట్టారట.
నిజానికి తెలంగాణలో ఇప్పటి వరకైతే ఒక్క సీటు కూడా గెలిచే సత్తా లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తే ఓకే. లేదంటే సొంతంగానే 119 స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల చెబుతుండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏపీలో కాబట్టి అన్న జైలులో ఉంటే షర్మిల పార్టీని నడిపించగలిగారు. అన్నను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ తెలంగాణలో అలా కాదు కదా. ఉమ్మడి ఏపీ ఉన్న టైంలో రాజకీయాలు వేరు. రాష్ట్ర విభజన తర్వాతి రాజకీయాలు వేరు ఇక్కడ ప్రాంతీయాభిమానం ఎక్కువ. వేరే రాష్ట్రాలకు చెందిన వారికి ఆదరణ చాలా తక్కువ. షర్మిల ఎంత కష్టపడినా ఇక్కడ రాణించడం కష్టమేనని టాక్.