ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటి నుంచో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఎప్పటి నుంచో గడపగడపకు ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు నిత్యం జనంలో ఉండేలా చూస్తున్నారు. ఇక తాజాగా కూడా వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. మరోసారి 175 సీట్ల టార్గెట్‌పై దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే వై ఏపీ నీడ్స్ జగన్? అనే ప్రోగ్రాం ద్వారా ప్రజా ప్రతినిధులను జనంలోకి పంపించనున్నారు. ఇప్పటి వరకూ ఒక ఎత్తైతే.. ఇక ముందు మరో ఎత్తు అని తెలిపారట. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వంటి అంశాలు జనంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.
ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. రానున్న ఆరు నెలలే కీలకం కాబట్టి వీలైనంత ఎక్కువగా ప్రజా ప్రతినిధులంతా జనంలోనే ఉండాలని జగన్ సూచించారట. అయితే వైసీపీ టికెట్ కేటాయింపు విషయంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. టికెట్ కేటాయింపు అనేది పూర్తిగా ఆయా ప్రజాప్రతినిధుల పనితీరుతో పాటు సర్వే ఆధారంగా కేటాయిస్తామన్నారు. టికెట్ కేటాయించనంత మాత్రాన తన వాళ్లు కాకుండా పోరని చెప్పుకొచ్చారు. మరో విధంగా అవకాశం ఇస్తానంటూ జగన్ అభయమిచ్చారు. టికెట్లపై ప్రతి ఒక్కరూ తన నిర్ణయాల్ని పెద్ద మనస్సుతో స్వాగతించాలని కోరారు.
గతంలో సిట్టింగ్‌లకే టికెట్ కేటాయిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మార్చేసరికి పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. మొత్తానికి సిట్టింగ్‌లు అందరికీన టికెట్లు ఇవ్వడం కుదరదని చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో సీటు దక్కకపోతే.. నామినేటెడ్ పోస్టులైనా దక్కుతాయన్న ఆశలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలు ఫైనల్ స్టేజ్‌లో ఉండటంతో ప్రజల్లోకి వెళ్లి.. మళ్లీ మెప్పును పొందాలని కొందరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ మోదం.. ఎవరికీ ఖేదం .. త్వరలో సీఎం జగన్ ఏం తెలుస్తారనేది.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి జగన్ వ్యాఖ్యలతో నేతల్లో టెన్షన్ ప్రారంభమైంది.