కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్.. తెలంగాణలో అంతా కన్ఫ్యూజన్..! ఒక్క బీజేపీ విషయంలోనే జనాలకు ఏ కన్ఫ్యూజన్ లేదు కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం ఏం జరుగుతుందో తెలియడం లేదు. నిజానికి కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా బలపడింది. అధికార బీఆర్ఎస్ పార్టీకే సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది. ఇక ఈ పార్టీలో చేరికలతో అధికార బీఆర్ఎస్‌లో ఆందోళన చోటు చేసుకుంటోంది. ఓవర్ కాన్ఫిడెన్సో.. లేదంటో ఓన్లీ కాన్ఫిడెన్సో కానీ సీఎం కేసీఆర్ అందరి కంటే ముందే నలుగురు మినహా అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. అంతకు ముందు నుంచే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి.
అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం వలసలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన వారు సైతం తిరిగి వస్తుండటం ఆ పార్టీని, అధినేతను కలవరపెడుతోంది. నిన్న మొన్నటి వరకూ తనను ఎవరైనా కలవాలంటే ముప్పు తిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించే కేసీఆర్ ఇప్పుడు అసంతృప్తులను స్వయంగా ప్రగతి భవన్‌కు ఆహ్వానించి మరీ బుజ్జగిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీని కనుసైగతో శాసించిన ఆయన వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో చాలా దిగి వచ్చారని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరగడం.. బీఆర్ఎస్‌కు తగ్గడం గులాబీ బాస్‌ను తీవ్రంగా కలవరపెడుతోందట.
జాతీయ స్థాయిలో జెండా పాతాలనుకుంటున్న కేసీఆర్‌కు ఇంట గెలవకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇక జనాల విషయానికి వస్తే.. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందో తెలియక బాగా కన్ఫ్యూజన్‌లో ఉన్నారట. సర్వేలు కూడా ఊహకు అందకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ఏది బెటరో తేల్చుకోలేక తికమక పడుతున్నారట. పైగా గులాబీ బాస్ హూంకరింపులు ఆగిపోయాయి. ఇదంతా చూస్తూ నివ్వెరబోతున్నారు. టికెట్లు ప్రకటించినప్పటి ధీమా ఇప్పుడైతే గులాబీ పార్టీలో కనిపించడం లేదు. మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలంగాణపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2014, 18 ఎన్నికల్లో అయితే తెలంగాణకు ఎదురు లేదు. పక్కా ఈసారి బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు తప్ప గెలిచే ఛాన్స్ వేరే పార్టీలకు లేదని జనం ఫిక్స్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం అలా ఫిక్స్ అయ్యే పరిస్థితి లేదు. ఇక చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.