ఆశకు హద్దుండాలి అంటారు. కానీ ఏపీ సీఎం జగన్ ఆశకు హద్దూ పద్దూ లేకుండా పోతోంది. ఇప్పటికే జగన్ 20 ఏళ్లలో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లెక్కలతో సహా వివరిస్తున్నారు. పరిస్థితులు 2019 మాదిరిగా లేవు. ఇప్పుడు మారిపోయాయి. ఆ సమయంలో 151 సీట్లను వైసీపీ కైవసం చేసుకుందంటే.. అప్పటి కారణాలు అప్పటికి ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సీన్ రివర్స్ అయ్యింది. కేవలం సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయనుకుంటే తప్పులో కాలేసినట్టే. జగన్ తొందరపాటు నిర్ణయాలు.. రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేయడం.. పోలవరం ఇలా చెప్పుకుంటే పోతే వైఫల్యాల లిస్ట్ చాంతాడంత ఉంది.
ఇవాళ సీఎం జగన్ తమ పార్టీ ప్రజాప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 175కు గానూ.. ఒక్కటి కూడా తగ్గకుండా 175 సీట్లు గెలవాలంటూ దిశా నిర్దేశం చేయనున్నారట. అప్పట్లో అంటే చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత రావడం.. జగన్ పాదయాత్ర చేసి.. అది చేస్తాను.. ఇది చేస్తానంటూ హామీల మీద హామీలు ఇవ్వడం కాస్త కలిసొచ్చింది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్నే దోచేశారని ప్రజలే విమర్శిస్తున్నారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తారంటూ టాక్ నడుస్తోంది.
ఇక రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, పంచాయతీ ఉప ఎన్నికల్లో సైతం వైసీపీ బొక్కబోర్లా పడింది. అంటే అటు పల్లెల్లోనూ.. ఇటు పట్టణాల్లోనూ వైసీపీ హవా తగ్గిందనే కదా దాని అర్థం. అవన్నీ పక్కనబెట్టి 175 సీట్లు గెలుచుకునేలా దిశానిర్దేశం చేస్తారట జగన్. సంక్షేమ పథకాలు మినహా జగన్ ప్రభుత్వ హయాంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లోనే కీలక ఘట్టం. పక్కా ఆ పార్టీకి బీభత్సమైన సానుభూతి వచ్చేసిందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థుల్లో సైతం మార్పు వస్తుందనడంలో సందేహం లేదు. నిత్యం ఏదో ఒక ఘర్షణను వారు స్వాగతించరు. పక్కాగా.. చంద్రబాబు, జగన్‌లలో ఎవరు మేలనే అంశంపై ఆలోచిస్తే.. చంద్రబాబే మేలని మధ్యతరగతి వర్గం అంటోంది. జగన్ చెప్పే దానికి, చేసే దానికి పొంతన లేకపోవడం కూడా జనాలను టీడీపీ వైపు చూసేలా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.