ఇప్పటి వరకూ ఏమో కానీ ఈసారి జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు లేని టీడీపీకి బాలయ్యే అన్నీ తానై సభను నడిపిస్తారనుకుంటే.. తన తీరుతో ఆయన అప్రతిష్టపాలవుతున్నారు. నిజానికి బాలయ్యకు తనను తాను నిరూపించుకునేందుకు దక్కిన సదవకాశం ఇది. చంద్రబాబు ఉన్న టైంలో అంటే సభకు రాకున్నా సరిపోయింది కానీ ఇప్పుడు అన్నగారి వారుసుడిగానూ.. పార్టీకి కీలకమైన నేతగానూ అధికార పక్షాన్ని నడిపించాల్సి ఉంది. కానీ అదేం జరగలేదు.
బాలకృష్ణ స్వతహాగానే ఆవేశపరులని అంతా అంటుంటారు. దాదాపు అదే నిజమని పలు సందర్భాల్లోనూ నిరూపణ అయ్యింది. దీనిని అధికార పక్షం అదనుగా తీసుకుంది. బాలయ్యను ఓ పథకం ప్రకారం రెచ్చగొట్టింది. దీంతో రెచ్చిపోయిన బాలయ్య తప్పటడుగులు వేశారంటూ టీడీపీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో మీసం మెలేయడం, తొడగొట్టడం, విజిల్ వేయడం వంటివి చేసి బాలయ్య తన ధోరణి తనదే అన్నట్టుగా వ్యవహరించారని అంతా అంటున్నారు. చంద్రబాబు లేని సమయంలో హూందాగా వ్యవహరించి ఆయన అరెస్ట్‌పై చర్చ జరపాల్సింది పోయి తానే చర్చనీయాంశం కావడమేంటని పార్టీ శ్రేణులు అంటున్నాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముడితే తాను కూడా వెళ్లారు. మంత్రి అంబటి రాంబాబుతోనూ డైలాగ్ వార్‌కి దిగారు.
నిజానికి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో.. రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గళమెత్తాల్సింది పోయి తొడగొట్టడం, విజిల్ వేయడం వంటి అనూహ్య పరిణామాలపై జనం నుంచి సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంబటి మీసం మెలేసి రా అనడంతో తాను కూడా తొడగొట్టి, మీసం మెలేశానంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ఇదంతా ఓకే అనుకున్నా కూడా స్పీకర్ పోడియం దగ్గకు వెళ్లే క్రమంలో అసభ్య సైగలు చేయడంపై దారుమనే టాక్ నడుస్తోంది. పైగా చంద్రబాబు కుర్చీపైనే నిలబడి బాలయ్య నినాదాలు చేయడం కూడా తెలుగు తమ్ముళ్లను తలలు పట్టుకునేలా చేసింది. వైసీపీ ట్రాప్‌లో పడిన బాలయ్య.. టీడీపీ స్ట్రాటజీలన్నీ మిస్ ఫైర్ అయ్యేలా చేశారని తెలుగు తమ్ముళ్లు ఫీల్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు సభలో సస్పెండ్ కూడా అయ్యారు. నిజానికి ఇది సర్వసాధారణం. కానీ బాలయ్యను మాత్రం వైసీపీ కావాలనే రెచ్చగొట్టిందని అంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అందునా చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియదు. ఈ తరుణంలో పార్టీలో బాలయ్య మరింత క్రియాశీలకంగా.. హూందాగా వ్యవహరించాలని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.