ఇప్పట్లో కష్టమేనా..?
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటికి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. సెప్టెంబర్-09న అరెస్ట్ అయిన చంద్రబాబు ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఆయన్ను బయటికి తీసుకురావడానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వే చేసిన విశ్వప్రయత్నాలన్నీ వర్కవుట్ కాలేదు. అటు ఏసీబీ కోర్టు.. ఇటు హైకోర్టు.. ఆఖరికి సుప్రీంకోర్టును కూడా చంద్రబాబు తరఫు లాయర్లు ఆశ్రయించారు. అయినా ఇప్పటికీ బాబు జైల్లోనే ఉన్నారు. ఇక సీఐడీ తరఫు లాయర్లు కస్టడీకి ఇవ్వాలని కోరడం.. సెప్టెంబర్- 23, 24 తారీఖుల్లో రెండ్రోజుల పాటు కోర్టులు అంగీకరించడంతో సెంట్రల్ జైల్లోనే బాబును విచారించారు. రెండ్రోజులూ కలిపి సుమారు 20 గంటలపాటు సీఐడి ఆయన్ను విచారించింది.
మళ్లీ రిమాండ్..
చంద్రబాబును మరికొన్నిరోజులు రిమాండ్‌కు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో అటు చంద్రబాబు.. ఇటు సీఐడీ తరఫున లాయర్లు మళ్లీ వాదించాల్సి వచ్చింది. రిమాండ్‌కు ఇవ్వాల్సిందేనని సీఐడీ.. అక్కర్లేదని బాబు తరఫున పోసాని వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విషయంలో పోసానిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. విచారణ పూర్తి జరగాలి కదా అని చివరికి అక్టోబర్-05 వరకు రిమాండ్ ఇస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. అంటే.. మొత్తం 11 రోజులపాటు చంద్రబాబు రిమాండ్‌లో ఉండాల్సిందేనన్న మాట. కోర్టు తీర్పుతో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలినట్లయ్యింది. తాజా రిమాండ్‌తో బాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఈ రెండ్రోజుల కస్టడీతో ఈ వారం జరగాల్సిన ములాఖత్ కూడా రద్దయ్యింది.
కస్టడీ సంగతేంటి..?
రెండ్రోజుల విచారణలో చంద్రబాబు సహకరించలేదని సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద మీడియాకు వెల్లడించారు. దీంతో బాబును కస్టడీకి తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. విచారణ కీలక దశలో ఉండటంతో కచ్చితంగా కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ కోరే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూస్తే.. కోట్లు పెట్టి లాయర్లను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినా ఫలితం లేకపోయిందనే ఆరోపణలు గట్టిగానే టీడీపీలోనే ఓ వర్గం నుంచి వస్తున్నాయి. ఇక రిమాండ్ పూర్తయ్యాక పరిస్థితి ఎలా ఉంటుంది..? అసలే మరికొన్ని కేసులు బాబుపై బనాయించడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి రావడం అస్సలు అయ్యే పనే కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. బాబు ఎప్పుడు బయటికొస్తారో.. టీడీపీ శ్రేణులు ఆయన్ను ఎప్పుడు చూస్తాయో మరి.