మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈరోజు వరకు నార్కోటిక్ పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కి ప్రయత్నాలు చేసిన హీరో నవదీప్ చివరికి నార్కోటిక్ పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. నేడు శనివారం విచారణకు హాజరైన నవదీప్ విజువల్స్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్నటివరకు మాధాపూర్ డ్రగ్స్ కేసులో తనకెలాంటి సంబంధం లేదు అని, తానెక్కడికి పారిపోలేదని చెప్పిన నవదీప్ ఈరోజు విచారణ అనంతరం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విచారణ తర్వాత బయటికి వచ్చిన నవదీప్ డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చారు, విచారణకు వచ్చాను. రాంచంద్ అనే వ్యక్తితో నాకు పరిచయం ఉన్నమాట వాస్తవమే. అది పదేళ్ల క్రితం మాట. నేనెక్కడా డ్రగ్స్ తీసుకోలేదు, గతంలో ఓ పబ్ ని నిర్వహించినందుకు విచారణకు పిలిచారు. అప్పుడు సిట్, ఈడీ విచారణ చేస్తే ఇప్పుడు నార్కోటిక్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.
అవసరముంటే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. ఏడేళ్ల క్రితం పాత ఫోన్ రికార్డులని కూడా చెక్ చేసారు. డ్రగ్స్ కేసులో సిపి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పని చేస్తుంది అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. అయితే ఏడేళ్ల క్రితం కేసు గురించి మాట్లాడాడు కానీ.. మాదాపూర్ డ్రగ్స్ కేసు గురించి మాత్రం నవదీప్ మాట్లాడలేదు.