టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల కస్టడీ విచారణకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఈ విచారణ కొనసాగించేందుకు సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. అలాగే కొన్ని షరతులను సైతం విధించింది. విచారణ సమయంలో ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు వెల్లడించకూడదని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారే చేసింది. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అధికారులు ఆయనను విచారించనున్నారు. అయితే నేటి నుంచి ఆయన కస్టడీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నుంచే హైడ్రామా ప్రారంభమైంది.
సీఐడీ డీఎస్పీ ధనంజయ నేతృత్వంలో12 మందితో కూడిన అధికారుల బృందం చంద్రబాబు విచారించడానికి నేటి ఉదయమే సిద్ధమైంది. నిజానికి 9:30 గంటలకు విచారణ ప్రారంభం కావాలి. కానీ వైద్య పరీక్షల పేరుతో దాదాపు 2 గంటల పైన అధికారులు కాలయాపన చేశారు. విచారణ సమయానికి ప్రారంభం కాకపోవడంతో టీడీపీ నేతలు కాస్త ఆందోళనకు గురయ్యారు. కాగా.. విచారణకు ఇద్దరు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావులను అధికారులు లోపలికి అనుమతించారు. విచారణ ప్రక్రియ మొత్తం సీఐడీ డిపార్ట్‌మెంట్ వీడియోగ్రఫీ చేస్తోంది. అలాగే రెండు అంబులెన్సులను సైతం అధికారులు జైలు లోపల సిద్ధంగా ఉంచారు.
విచారణలో భాగంగా ప్రతి గంటకు 5 నిమిషాల పాటు చంద్రబాబుకు సీఐడీ అధికారులు బ్రేక్ ఇస్తూ వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. కాగా.. రాజమండ్రి సెంట్రల్ జైలు వెలుపల రెండంచెల భారీ బందోస్తును అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు అధికార పార్టీ సొంత మీడియా రకరకాల కథనాలతో ఊహాజనిత కథనాలను వెలువరిస్తోంది. కీలకమైన ఫైల్స్ ఏవో సీఐడీ అధికారులు చంద్రబాబు ఎదుట ఉంచనున్నారంటూ ప్రచారం నిర్వహిస్తోంది. అసలు జైలు లోపల ఏం జరుగుతోందో బయటకు రాకూడదని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి వార్తలు రాయడం ఎంత వరకూ కరెక్ట్ అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కీలకమైన ఫైల్స్ చంద్రబాబు ఎదుట ఉంచేది నిజమే అయితే అసలు ఈ విషయం అధికార పార్టీ మీడియాకు ఎలా లీక్ అయ్యింది? అనేది చర్చనీయాంశంగా మారింది.