ప్రతి వారం ఏవో కొత్త సినిమాలు వస్తాయి.. వాటిలో కొన్ని ప్రేక్షకులకి నచ్చుతాయి.. కొన్ని సోదిలోకి లేకుండా పోతాయి. ఇక రెండు వారాల క్రితం విడుదలైన జవాన్ సునామి, మిస్ శెట్టి-మిస్టర్ శెట్టిల జాతరతో థియేటర్స్ కళకళలాడాయి. గత వారం ఛాంగురే బంగారు రాజా, మార్క్ ఆంటోని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇవేమి తెలుగు ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. ఇక ఈ వారమూ పెద్ద చిత్రాల హడావిడి లేకపోవడంతో పొలోమంటూ బోలెడన్ని చిన్న చిత్రాలు విడుదలకి రెడీ అయ్యాయి.
నిన్న శుక్రవారం వరసగా చిన్న చిత్రాలు విడుదలతో థియేటర్స్ దగ్గర పెద్దగా ప్రేక్షకుల సందడి కనిపించలేదు. మట్టి కథ అనే చిన్న సినిమా, ఇంకా నచ్చినవాడు, రుద్రంకోట, అష్టదిగ్భందనం, సప్త సాగరాలు దాటి అనే డబ్బింగ్ మూవీస్ విడుదల కాగా.. అందులో మట్టి కథ అందిరిని మెప్పించింది. కానీ ప్రమోషన్స్ లేక ఆ చిత్రం ప్రేక్షకుల్లోకి ఎంతవరకు వెళుతుంది అనేది చెప్పడం కష్టం. మరి ఈ వారం ఇంత బోరింగ్ గా ఉంటుంది అని ఆడియన్స్ కూడా ఊహించి ఉండరు.
అయితే రీ రిలీజ్ అయిన 7/G బృందావన కాలనీ మాత్రం ఎక్కడ విడుదలైతే అక్కడ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. ఈ వారం సినిమాలు ప్రేక్షకులని ఉసూరుమనిపించాయి. అంటే తెలుగులో మిస్ శెట్టికి మరో వారం అవకాశం దొరికింది. అలాగే రేపు 28న, 29 న రాబోయే చిత్రాలపై ప్రేక్షకుల చూపు ఆటోమాటిక్ గా పడుతుంది. అవే రామ్ స్కంద, పెద్దకాపు 1 చిత్రాలు 28, 29 తేదీల్లో విడుదలకి రెడీ అవుతున్నాయి.