స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడిపై చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. ఈ క్రమంలోనే తొలిసారిగా ఆయన తన బాధను, ఆవేదనను న్యాయమూర్తి ఎదుట వెలిబుచ్చారు. ఆ మాటలు విన్న వారెవరికైనా ఆయన తన అరెస్ట్‌పై ఎంత కలత చెందుతున్నారన్నది అర్థమవుతుంది.
తప్పు చేసి ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేసి ఉండాల్సిందని ఆయనే చెబుతున్నారు. తప్పు చేయకున్నా కూడా తనను అరెస్ట్ చేశారనే మనో వేదనకు చంద్రబాబు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న తనను కనీసం ఒక నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు. తాను తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సిందన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.
దీన్ని శిక్షగా భావించకండి..
తను అన్యాయంగా అరెస్ట్ చేశారని... ఇది ‘నా బాధ.. నా ఆవేదన.. నా ఆక్రందన’ అని చంద్రబాబు తెలిపారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంటే ఇచ్చారన్నారు. తనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని.. అవి నిర్ధారణ కాలేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. చట్టాన్ని గౌరవిస్తానని.. న్యాయం గెలవాలని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. అసలు దీన్ని శిక్షగా భావించొద్దని సూచించారు. మీపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని.. నేరనిరూపణ కాలేదన్నారు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్ విధించామని చంద్రబాబుకు న్యాయమూర్తి తెలిపారు. మీరు 24 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటారని వెల్లడించారు.