టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లింది మొదలు ఆ పార్టీని పూర్తిగా భూ స్థాపితం చేయాలని వైసీపీ కంకణం కట్టుకున్నట్టుంది. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసి అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలోనూ రచ్చ చేస్తోంది. ఇటీవల చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాట.. టీడీపీ తిరిగి నందమూరి కుటుంబం సొంతం కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ చేస్తున్నారు. అసలే వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అనేది అందరికీ తెలిసిందే. దాని సహకారంతో నారా కుటుంబం చెర వీడి టీడీపీ నందమూరి కుటుంబం సొంతం కాబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారానికి టీడీఎల్పీ మీటింగ్‌లో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్న మాటలను యాడ్ చేస్తున్నారు. ‘ఏమీ పర్వాలేదు.. మీకు నేనున్నా.. ధైర్యంగా ఉండండి. అవసరమైతే రాష్ట్రం మొత్తం పర్యటిస్తా. రోడ్ మ్యాప్ సిద్ధం చేయండి’ అన్నారు. నిజానికి చంద్రబాబు జైలు పాలైన దగ్గర నుంచి బాలయ్య యాక్టివ్ అయిపోయారు. తిరిగి టీడీపీని నిలబెట్టేందుకు తన వంతు సహకారం అందిస్తున్నారు. దీనికి పార్టీని బాలయ్య హస్తగతం చేసుకోబోతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం నిలబెట్టింది. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే కదా.. ట్రూ లీడర్ లక్షణం. ఇప్పుడు బాలయ్య చేస్తున్నది కూడా అదే. దీనికే పార్టీ చేతులు మారిపోయినట్టేనని టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారని వారిపై నెట్టి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అది చాలదన్నట్టు నేడు అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు సైతం అవే వ్యాఖ్యలు చేశారు.
‘‘గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్‌గా ఉన్నాడు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం తిప్పాడు. మీసం మీ పార్టీలో తిప్పండి. అసెంబ్లీలో మీసం తిప్పితే ఉపయోగం లేదు. జన్మనిచ్చిన తండ్రికి, క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది. ఆ అపవాదును తొలగించుకునే అవకాశం వచ్చింది
మీ బావ జైల్లో ... అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. ఇదే మీకు సరైన సమయం. పోయిన పగ్గాలు తీసుకోండి..నందమూరి వంశాన్ని నిరూపించుకోండి...పార్టీని బ్రతికించుకోండి’’ అని అంబటి అన్నారు. నిజానికి తమ పార్టీ చంద్రబాబు చేతిలో పడి చచ్చిపోతోంది అనుకుంటే.. లేదంటే టీడీపీ అప్రతిష్ట పాలవుతోందనుకుంటే ఎప్పుడో నందమూరి కుటుంబం పార్టీ పగ్గాలను అందుకునేది కదా. ఏనాడూ ఆ సాహసం కూడా చేయలేదు. దానికి కారణం చంద్రబాబు చేతుల్లో పార్టీ సురక్షితంగా ఉందనే కదా. ఎందుకో వైసీపీ కావాలనే ఈ వ్యవహారాన్ని హైలైట్ చేస్తోంది.