తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. అసలే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీ కుదేలైందంటే.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించి పెద్ద తప్పిదమే చేసింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారన్న మాటే గానీ అసలు ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏమాత్రం హైలైట్ అవడం లేదు. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం బీజేపీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ పైనే ఎక్కువగా గురిపెట్టారు. అసలు బీజేపీ తమకు ఏమాత్రం పోటీ కాదన్న ధోరణిలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఇది చాలదన్నట్టు బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ వంటి ఒకరిద్దరు నేతలకే మితిమీరిన ప్రయారిటీ ఇవ్వడం కొందరు నేతలకు మింగుడు పడటం లేదు.
ఈ పరిణామాలన్నీ జీర్ణించుకోలేని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రవీంద్ర నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. నేడు వీరంతా రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరు పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే వీరి రహస్య భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీలో ఉండటం వల్ల అవమానాలే తప్ప గౌరవం వంటివి ఏనాటికి దక్కవని వీరంతా అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పదవులు ఇచ్చినా కానీ నామమాత్రపు పదవులేనని.. కనీసం పార్టీ కార్యకలాపాలపై నేతలకు సమాచారం కూడా ఉండదు. దీంతో మొత్తానికి మీటింగ్‌లో పార్టీ మార్పు అంశంపై పక్కాగా డిసైడ్ అవుతారని సమాచారం.
ఆసక్తికర విషయం ఏంటంటే.. కిషన్ రెడ్డి ఇటీవల దీక్ష చేపట్టారు. ఈ దీక్ష గురించి ఈ ఆరుగురు కీలక నేతలకు కనీసం సమాచారం కూడా లేదట. సరే.. అదేదో అయిపోయిందిలే అనుకుంటే.. తాజాగా అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనను కలిసేందుకు ఈ ఆరుగురు నేతలు ప్రయత్నించినా కూడా వారిని అడ్డుకున్నారట. పదవుల విషయంలో పక్కనపెట్టడం.. ఏదైనా కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం.. పార్టీ అధిష్టానాన్ని కలవనీయకుండా అడ్డుకోవడం వంటి విషయాలు ఈ ఆరుగురు నేతల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయని సమాచారం. మొత్తానికి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రవీంద్ర నాయక్, రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తప్పుకుని పార్టీకి గట్టి ఝలక్కే ఇస్తారని టాక్. వీరు తప్పుకుంటే పార్టీకి భారీ నష్టమే జరుగుతుందనడంలో సందేహం లేదు.