తెలంగాణలో అంటే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది కానీ ఏపీలో అవుతుందా? ఏమో కాస్త కష్టమే.. డ్యామేజ్ అయిన ఇమేజ్ తిరిగి సరవుతుందా? అబ్బో చాలా కష్టం. ఏమో ఒక రాయి వేస్తే పోలా? అన్నీ సరవుతాయేమో అన్నట్టుగా ఉంది ఏపీ సీఎం జగన్ వ్యవహారం. అసలే ఏపీలో వైసీపీ పరిస్థితి మూలిగే నక్క మాదిరిగా ఉందంటే.. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి స్వయంగా నెత్తిన తాటికాయ కూడా వేసేసుకుంది. ఇంకేం కోలుకుంటుంది. కానీ సీఎం జగన్ మాత్రం ఆయింట్‌మెంట్ రాసి రికవర్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఏపీలో వైసీపీ మెల్లమెల్లగా పతనమవుతూ వస్తోంది. ఎవరు ఇచ్చారో కానీ జగన్‌కు ఒక సచ్చు సలహా ఇచ్చారు.
వెంటనే ఆ సలహాను తను లండన్‌కు వెళ్లి మరీ జగన్ అమలుపరిచారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించి జైల్లో వేయించారు. ఇంకేముంది.. టీడీపీ అధినేత స్కామ్‌లో ఇరుక్కున్నారు. రేపో మాపో నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేసేస్తే టీడీపీ ఏపీలో పూర్తిగా గాయబ్ అవుతుందని భావించారు. కానీ సీన్ రివర్స్. అనుకున్నదొకటి అయ్యిందొకటి. అక్కడక్కడ బాగున్న పార్టీ కూడా మట్టిలో కలిసిపోయింది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ చక్కగా పుంజుకుంది. ఈసారి అక్కడ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఈ తరుణంలో జగన్ సెంటిమెంటుకు సానబెట్టారు. విశాఖ నుంచి పాలన అనే పాత పల్లవినే కొత్తగా అందుకున్నారు. మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉన్నా.. పట్టనట్టే దసరా తర్వాత విశాఖ నుంచి పాలన అని చెప్పి.. కార్యాలయాల అన్వేషణకు ఒక కమిటీ వేయనున్నట్టు తెలిపారు.
మూడు రోజులు విశాఖ నుంచి, మరో మూడు రోజులు తాడేపల్లి నుంచి పాలన సాగిస్తారట. మరి ఏడో రోజో? పాలనకు సైతం హాలిడే ప్రకటించేస్తారా? అయినా ఇదంతా ఎందుకులే కానీ దసరా నుంచి అయితే విశాఖ నుంచే పాలన ఫిక్స్ అట. జగన్ ఆస్థాన సర్వే సంస్థ ఐప్యాక్ సైతం అధికారం సైకిల్‌దే అని చెప్పడం.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితి దారుణమని చెప్పడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. రాయలసీమ ఎలాగూ తమదే.. ఇక ఉత్తరాంధ్రను సైతం సొంతం చేసుకుంటే విజయం తథ్యం అని భావిస్తున్నారట. అమరావతి ప్రాంతంలో నో స్కోప్.. ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో అసలు ఛాన్సే లేదు. కాబట్టి ఉత్తరాంధ్రనైనా కాపాడుకోవాలనేది జగన్ స్కెచ్ అట. మరి విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతుంటే చోద్యం చూసింది.. రుషికొండను తొలిచేసినవి ఉత్తరాంధ్రవాసులు అంత త్వరగా మరచిపోతారా? ఏమో చూడాలి.