రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదో జరుగుతోంది. అది కాస్తా తాజాగా వచ్చిన న్యూస్‌తో మరింత ఎక్కువైంది. ఈ జైల్లో ఉన్నది సాదా సీదా వ్యక్తి కాదు.. ఏకంగా 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి విషయంలో భద్రత ఎలా ఉండాలి? కానీ కర్రలిచ్చి భద్రత పెట్టారు. అంత పెద్ద నేతకు కర్రలతో భద్రతా? నవ్విపోదురు గాక. దేశంలోనే ప్రముఖ జైళ్లలో రాజమండ్రి ఒకటి. దానిని అంత ఉన్నంతంగా తీర్చి దిద్దడంలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది. మరి అలాంటి జైల్లోనే ఆయనకు భద్రత కరువైంది. ఇప్పుడు తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో మరో ఘటన రాష్ట్రాన్ని నివ్వెర పరిచింది.
ఈ న్యూస్ చూసి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లో కంగారు రెండింతలు పెరిగింది. వెంటనే ట్విటర్ వేదికగా తన కంగారును వెలిబుచ్చారు. అసలు ఆ న్యూస్ ఏంటంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో సత్యనారాయణ అనే రిమాండ్ ఖైదీ జైలులో దోమలు కుట్టడంతో డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ న్యూస్ మీడియా ద్వారా తెలుసుకున్న నారా లోకేష్.. ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ దోమలతో కుట్టించి జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబుకు హాని తలపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదు’’ అని ట్వీట్ చేశారు.
మొన్నటికి మొన్న చంద్రబాబు ఆరోగ్యం కోసం అంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి సహా మరికొందరు పూజలు చేయించారు. అసలు నారా వారి ఫ్యామిలీ చంద్రబాబు గురించి ఎందుకింత ఆందోళన చెందుతోంది. నిజంగానే ఆయన ప్రాణానికి హాని ఉందా? అని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రిమాండ్ ఖైదీ మరణించిన ఘటనతో వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది. చంద్రబాబును ఏదో చేయాలని వైసీపీ స్కెచ్ గీసిందంటూ ప్రచారం అయితే బీభత్సంగానే జరుగుతోంది. చంద్రబాబు ఉన్న జైల్లోనే రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మరణించడమనేది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.