చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలో తెలియక ఏపీ సీఎం జగన్ నానా తంటాలు పడుతుంటే.. గమ్మున ఉండాల్సింది పోయి ఈ రెచ్చగొట్టుడు పనులేంటి? ఏపీ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. మరి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చూస్తూ ఊరుకుంటారా? అసెంబ్లీని వణికించారు. ఒకవైపు సీఎం జగన్‌కు మరి టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అండగా ఉన్నారంటూ ఈ వ్యవహారమంతా వెనుకుండి నడిపించింది బీజేపీయేనని చర్చ నడిచింది. ఆ తరువాత ఈ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీ అధిష్టానం గప్ చుప్. అండగా ఉంటుందనుకున్న బీజేపీ లేకపాయే.. ఏపీలో చూస్తేనేమో ఆఫ్ట్రాల్ రూ.300 కోట్ల కోసం చంద్రబాబు స్కాం చేస్తారా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.
పైగా 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు తలుచుకుంటే.. జగన్‌ను మించిన సొమ్ము వెనుకేసేవారు కదా. అప్పుడెప్పుడూ లేనిది రూ.300 కోట్ల కోసం అక్రమానికి పాల్పడ్డారా? అది నూటికి నూరు పాళ్లు కక్షపూరిత కేసేనని జనం డిసైడ్ అయ్యారు. ఈ వ్యవహారంతో జగన్‌పై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దీన్ని పొగొట్టుకోలేకే నానా తంటాలు పడుతుంటే.. ఇవాళ సభలో అంబటి రెచ్చిపోయారు. మేరుగ నాగార్జున, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తదితరులు టీడీపీ ఎమ్మెల్యేల వైపు దూసుకొళ్లారు. ఇక అంబటి అయితే నీ ప్రతాపం సినిమాల్లో చూసుకో పో అంటూ ఇష్టానుసారంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. ఏపీ అసెంబ్లీ మొత్తం ఒక్క అంబటి కారణంగా రచ్చ రచ్చ.
అంబటి వ్యాఖ్యలతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే బాలయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. మీసం మెలేసి తొడగొట్టారు. ‘అంబటి రా..రా.. చూసుకుందాం’ అంటూ సవాల్ విసిరారు. మొత్తానికి నినాదాలు, అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. ఇక మంత్రులు అంబటి రాంబాబు, రోజా, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని వంటి వారంతా మరింత మైనస్. వీరు చేసే పనులతో ఆ పార్టీ అధోగతి పాలవుతోంది. ఇష్టానుసారంగా నోటికి పని చెప్పడం.. అధినేత చోద్యం చూస్తూ ఉండటంతో పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు అసలే చంద్రబాబు వ్యవహారంతో పీకల్లోతు కూరుకుపోయిన పార్టీని పైకి తీసుకురావాలి కానీ మరీ తొక్కేయడమేంటో అధికార పార్టీ నేతలకే తెలియాలి.