చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదంటారు పెద్దలు. జీవితాన్ని ఎంతలా కాచి ఒడబోసి చెప్పారో కానీ అక్షర సత్యం. కత్తితో పొడిపించుకుంటేనే మైలేజ్ వస్తుంది.. పొడిస్తే రాదు అని అనుకున్నారో ఏమో కానీ.. ఏపీ సీఎం జగన్ మొత్తానికి తప్పులో కాలేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపించేశాం. ఇక ఈసారి కూడా మాదే అధికారం అనుకున్నారు. కానీ తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచాడని.. అది జనంలోకి మరోలా వెళ్లిపోయింది. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును జైలుకు సాగనంపారని.. దీని మొత్తానికి సూత్రధారి జగనేనంటూ జనంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. మరి దీని ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో మామూలుగా ఉంటుందా?
తాజాగా ఓ సర్వే సంస్థ.. చంద్రబాబు జైలుకు వెళ్లిన అనంతరం ఏపీలో పరిణామాలపై ఆరా తీసింది. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై సర్వే చేసింది. చంద్రబాబును జైలుకు పంపకుంటే సర్వే ఫలితం మరోలా ఉండేదేమో కానీ పంపిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. జగన్‌కు వ్యతిరేకంగా సిట్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఈ సంస్థ సర్వే ఫలితాలను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ సర్వే సంస్థ కథనం ప్రకారం.. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఏపీ ప్రజలు తేల్చి చెప్పారట. అంతేకాదు.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ సీఎం జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందట. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం తథ్యమని సర్వే సంస్థ తెలిపింది.
ఈసారి చంద్రబాబు సీఎం కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని సర్వే తేల్చింది. జనసేన పొత్తుతో టీడీపీ అప్రతిహతంగా దూసుకుపోతుందట. ఏతావాతా తేలిందేంటంటే.. మున్ముందు జగన్‌కు చుక్కలే అని. చంద్రబాబు అరెస్ట్‌తో జరిగే నష్టం కంటే లాభమే ఎక్కువట. ఇక ఇప్పుడు ఈ సర్వేపై వైసీపీ నేతలు ఎలా స్పందింస్తారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంత సర్వే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేయించిన పెయిడ్ సర్వే వంటివి ఈ స్పందనలో కామన్‌గా ఉండే అంశాలు. ఏది ఏమైనా జగన్‌కు సలహాదారులు ఎవరో కానీ ఆయనను బాగా రాంగ్ ట్రాక్‌లో నడిపించారు. ఆయన గొయ్యిని ఆయన చేతే తవ్వించారు. టోటల్‌గా జగన్ భస్మాసురుడి మాదిరిగా తన చేతిని తన నెత్తిపైనే పెట్టుకున్నారు. గెలిచే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు.