సర్వేలను నమ్ముకుని ముందుకెళితే ఎంత గొప్ప ప్రభుత్వమైనా బొక్కబోర్లా పడటం ఖాయం. కొన్ని సర్వే సంస్థలు ఇంట్లో కూర్చొని రిపోర్టులు ఇచ్చేస్తూ ఉంటాయి. మరికొన్ని సర్వే సంస్థలు కొంతమంది జనాలను అడిగి ఓవరాల్ రిపోర్ట్ ఇచ్చేస్తాయి. పైగా ఇప్పుడు చేసే సర్వేలకు క్రెడిబులిటి ఉండదనే చెప్పాలి. కనీసం తమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరో తెలియదు. ఎన్నికలు ఎప్పుడనేది తెలియదు.. అలాంటప్పుడు సర్వేలు కచ్చితమైన రిపోర్టును ఎలా ఇవ్వగలుగుతాయి. అభ్యర్థిని బట్టి ఓటర్ మైండ్ సెట్ మారొచ్చు. ఎన్నికలు జరిగే సమయానికి కూడా మైండ్ సెట్ మారే అవకాశం ఉంది. సర్వేకు.. ఎన్నికలకు మధ్య సమయంలో ఏమైనా జరగొచ్చు. ఇలాంటి సర్వే రిపోర్టులను పట్టుకుని వైసీపీ గోదారి ఈదాలనుకుంటోంది.
సర్వేలను బలంగా నమ్ముతున్న వైసీపీ అధినేత జగన్ పగటి కలల్లో మునిగి తేలుతున్నారట. తాను నొక్కిన బటన్లు తనకు ఓట్ల వర్షం కురిపిస్తాయనే భ్రమలో ఉన్నారట. సంక్షేమ పథకాలు మినహా అభివృద్ధి మాటెరుగని జగన్.. ఆ సంక్షేమమే తనకు కాస్త సీట్లు తగ్గినా కూడా సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఖాయమనే ధీమాలో ఉన్నారట. మొత్తానికి సర్వేలు పట్టుకుని దేశం తగలడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలా అయిపోయారట జగన్. లెక్క కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ సీఎం పీఠం మాత్రం తనదే అంటున్నారట. నిజానికి ఐప్యాక్ ఆయనను ఇలా భ్రమలో ఉంచిందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. గ్రౌండ్‌లో పరిస్థితి చూస్తే జగన్‌కు అసలు విషయం బోధపడుతుందంటున్నారు. కానీ అసలు విషయం ఆయనకు వెళ్లి చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.
సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో 2019 సీన్ రిపీట్ అవుతందట. రాయలసీమలో 52 స్థానాలకి గానూ 45 చోట్ల వైసీపీ గెలవడం పక్కా అని సొంత సర్వేలు చెబుతున్నాయి. కానీ కడపకే సరిగా దిక్కు లేదు ఇంకా మిగిలిన మూడు జిల్లాలైతే సరే సరి అని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఉత్తరాంధ్రలో అయితే మొత్తానికి కొలాప్స్ అని అంటున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలు.. ఉభయ గోదావరి జిల్లాలు జనసేనకు ఫేవర్.. ఇటు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం అంతా టీడీపీకి ఫేవర్, చిత్తూరు టీడీపీ, కృష్ణా, గుంటూరు టీడీపీకి ఫేవర్‌గా ఉన్నాయి. ఇంకెక్కడ వైసీపీ? అసలుకే వైసీపీకి సీట్లు రాకుండా పోవు కానీ అధికారం దక్కించుకునేంత సీన్ అయితే లేదు. మొత్తానికి సర్వేలను నమ్ముకుని ముందుకు వెళుతున్న జగన్‌కు భారీ దెబ్బే తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.