ఏంటో.. కమలం పార్టీ తెలంగాణ చీఫ్‌గా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. చేరికల కమిటీ అంటూ ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను బీజేపీ నియమించింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఎవరైనా మీ పార్టీలో చేరుతాం అంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వారు చేరబోయే సమయానికి జంప్ అవుతున్నారు పార్టీ నేతలు. ఇదంతా చూస్తుంటే బీజేపీకి నాయకులు అక్కర్లేదేమో అనిపిస్తోంది. పోనీ అవసరమున్నా కూడా ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు. చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. తీరా వారు చేరబోయే సమయానికి పార్టీ కార్యాలయంలో ఎవరూ ఉండటం లేదు.
పార్టీలో చేరుదామనుకున్న నేతలు కాస్త ముందుగానే సర్వసాధారణంగానే బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసుకుని నానా హంగామా చేసి జనంతో కలిసి ర్యాలీగా బీజేపీ ఆఫీసుకి వస్తే ఆ సమయానికి నేతలంతా గాయబ్ అవుతున్నారు. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ విషయంలోనూ ఇదే జరిగింది. అలాగే మాజీ మంత్రి కృష్ణయాదవ్. వీరిద్దరికీ తొలుత పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసుకుని ఇద్దరూ నానా హంగామా చేశారు. చికోటి ప్రవీణ్ అయితే మరో అడుగు ముందుకేసి ర్యాలీ కూడా నిర్వహించారు. ఆయన పార్టీ కార్యాలయానికి దగ్గరలో ఉన్నారని తెలుసుకున్న నేతలు.. అప్పటికే కాషాయ కండువా కప్పుకోవడానికి వచ్చిన మాజీ మంత్రి అజ్మీరాచందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్‌కు సడెన్‌గా కండువా కప్పేసి సెకన్లలో మాయమయ్యారు. అక్కడికి వెళ్లి నోరెళ్లబెట్టడం చికోటి ప్రవీణ్ వంతైంది.
కృష్ణ యాదవ్ అంటే తనకు అడ్డొస్తారని.. ఆయన రాకను కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని టాక్. వీరిద్దరిదీ ఒకే నియోజకవర్గం కావడంతో సీట్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతాయని కిషన్ రెడ్డి అడ్డుకున్నారట. మరి చికోటి ప్రవీణ్ చేరికకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఎందుకు అడ్డుకున్నట్టు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోనీ నేర చరిత్ర ఉందని అడ్డుకున్నారంటే.. బీజేపీలో నేర చరిత్ర ఉన్నవారు లెక్కలేనంత మంది ఉన్నారు. పైగా ఈ విషయం తెలిసే కదా.. ప్రవీణ్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రస్తుతం పెద్దగా హైలైట్ అవని బీజేపీలో చేరడమే గొప్పైతే.. చేరికల కోసమే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి చేరికలంటేనే పారిపోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు పార్టీలో జాయినింగ్స్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. పార్టీలో చేర్చుకుంటామని చెప్పడంతో వారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆపై చేతులెత్తేస్తే వారి ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఇక ఇది ఇలాగే రిపీట్ అయితే మాత్రం బీజేపీ వైపు కన్నెత్తి చూసే దిక్కుండదు.