ఏపీలో ఎప్పటి నుంచో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని టాక్ నడుస్తోంది. బీజేపీ మాటేమో కానీ ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. తమతో బీజేపీ కూడా కలిసివస్తుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. కానీ చూడబోతే పరిణామాలు మరోలా ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి ముందుకు వెళ్లే అవకాశమే కనిపించడం లేదు. బీజేపీ, వైసీపీల మధ్య క్రమక్రమంగా విడదీయరాని బంధం ఏర్పడుతోంది. అసలు వైసీపీ అధినేత జగన్‌కు ఆయన పార్టీ నేతలకు ఎప్పటి నుంచో బీజేపీ సపోర్టుగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ వెనుక బీజేపీ ఉంది కాబట్టే.. జగన్ కానీ.. ఆయన సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు అలా స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారనేది బహిరంగ రహస్యమే.
తాజాగా వైసీపీ, బీజేపీల బంధం మరోసారి బయట పడింది. ఇప్పటి వరకూ చూసుకుంటే.. మోదీ ప్రభుత్వం ఏం చేసినా కూడా మంచే కానీ.. చెడే కానీ దానికి వైసీపీ కళ్లు మూసుకుని మరీ మద్దతు తెలియజేస్తూ ఉంటుంది. ఆ ప్రేమతోనేనేమో తమ పార్టీలో వైసీపీ భాగస్వామి కాకున్నా కూడా వైసీపీకి బీజేపీ చాలా ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రం కీలక పదవి అప్పగించింది. విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ ఉపాధ్యక్షుల ప్యానెల్‌లోకి తీసున్నట్టు సోమవారం ఉదయం ప్రకటించింది. విజయసాయితో పాటు మరో 8 మందిని ఎంపిక చేసింది. వారందరి సంగతి పక్కనబెడితే విజయసాయిని తీసుకోవడమే చర్చనీయాంశంగా మారింది. ఒకరకంగా వైసీపీకి తన ఫుల్ సపోర్టును బీజేపీ ఇస్తుంటే.. టీడీపీ, జనసేనతో ఎలా పొత్తు పెట్టుకుంటుంది?
ఇప్పుడు టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ముందుకు వెళ్లడం అసాధ్యమనే అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పార్లమెంటులో అత్యధిక ఎంపీలున్న పార్టీల్లో వైసీపీ ఒకటి. మరి అలాంటి పార్టీని బీజేపీ వదులుకుంటుందా? అనేది పెద్ద ప్రశ్న. అసలే విపక్ష కూటమి ఒకటి సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. ఈ తరుణంలో వైసీపీని వదులుకుని టీడీపీ, జనసేనలతో ముందుకెళ్లడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా అయితే జనసేన అధినేత.. బీజేపీని వదులుకునేందుకు సిద్ధమవుతారా? అంటే దాదాపు ఔననే సమాధానమే వినిపిస్తోంది. దాదాపు తమ పయనం వైసీపీతోనేనని బీజేపీ చెప్పకనే చెబుతూ వస్తోందని జనంలో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఏపీలో మున్ముందు రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయే అవకాశం కనిపిస్తోంది.