ఒకటా.. రెండా లెక్కలేనన్ని కేసులను బనాయించి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైలు నుంచి రానివ్వకుండా ఉండాలన్నదే జగన్ సర్కార్ టార్గెట్ అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలకు ఇంకొన్ని రోజులే సమయం ఉండటంతో బాబును ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అంటూ మచ్చలేని చంద్రుడిపై అక్రమంగా కేసులను తన దర్యాప్తు సంస్థలను వినియోగించుకొని బనాయించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. ఇది డొల్ల అని దాదాపు తేలిపోయింది. అటు కోర్టుల్లో విచారణ, తీర్పు.. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని ప్రముఖులు, తెలుగు ప్రజల నుంచి వస్తున్న ఊహించని మద్దతుతో వైఎస్ జగన్‌కు దిమ్మదిరిగి బొమ్మ కనపబడినట్లయ్యింది. అటు మద్దతు పెరుగుతున్న కొద్దీ.. ఇటు చంద్రబాబుపై కేసుల సంఖ్య పెంచాలని కక్షగట్టింది.
ఇంకెన్నాళ్లు ఇలా..!
స్కిల్ డెవలప్మెంట్ అనేదానిలో కుంభకోణం జరిగిందా..? లేదా..? అనేది న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుండగానే చంద్రబాబుపై మరో ఫైబర్ నెట్‌స్కాం కేసు మోపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ వేసింది. అటు వారెంట్ వేయడం.. ఇటు కోర్టు స్వీకరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. టెర్రా సాఫ్ట్ అనే సంస్థకు అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది. మొత్తం రూ.121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చినట్లు సిట్ ఆరోపిస్తోంది. వాస్తవానికి.. 2021 లోనే ఫైబర్ నెట్‌లో కుంభకోణం జరిగిందని బయటికి రావడం, దీంతో19 మందిపై సీఐడీ కేసు నమోదు చేయడం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలిసిందే. ఈ పిటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకటి తర్వాత ఒకటి కేసు బనాయించి చంద్రబాబును ఇబ్బంది పెడుతూ.. ఇంకెన్నాళ్లు ఇలా ప్రభుత్వాన్ని నడుపుతారని టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
క్లియర్ కట్‌గా అర్థమైందిగా!
సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే.. చంద్రబాబుపై ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కేసుల పర్వం కొనసాగిస్తోందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా చంద్రబాబు జైల్లో ఉండగానే ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరించినా.. కేసుల పర్వం కొనసాగించినా రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తున్నారు.. రేపొద్దున ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది క్లియర్‌కట్‌గా అధికార పార్టీ పెద్దలకు స్పష్టంగా అర్థమయ్యే ఉంటుందేమో.! ఏదేమైనా.. ‘దుష్టుడి దుశ్చర్యలని.. రాష్ట్రం చూస్తోంది’ ! రేపొద్దున్న ప్రజలే వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని సామాన్య ప్రజలు సైతం అనుకుంటున్న పరిస్థితి. అందుకే.. జగన్ తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నాడని టీడీపీ పదే పదే చెబుతున్నది. కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న జగన్.. మచ్చలేని చంద్రుడిలా చంద్రబాబు బయటికొస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది 2024 ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. ఏం జరుగుతుందో చూద్దాం మరి.