టీడీపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఇంట్రస్టింగ్ చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లారు కాబట్టి పార్టీలో నంబర్ 2 ఎవరనే దానిపై వైసీపీ చర్చిస్తోంది. తమ అనుకూల మీడియా సంస్థల ద్వారా నంబర్-02 ఎవరంటూ కథనాలు రాయిస్తోంది. పైగా చంద్రబాబు ఎవ్వరినీ ఎదగనివ్వలేదని.. పార్టీని నడిపించే వారే లేరంటూ ప్రచారం చేస్తోంది. మరి తానున్నానని.. అందరినీ కలుస్తానంటూ చెప్పిన నందమూరి బాలకృష్ణ సంగతేంటి? తండ్రిని అరెస్ట్ చేస్తారన్న న్యూస్ వచ్చింది మొదలు.. నేడు ఢిల్లీకి వెళ్లి తన తండ్రికి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తున్న నారా లోకేష్ సంగతేంటి? ఇక ఒక వారసుడికి ఇంతకంటే ఏం కావాలి?
జగన్‌కు దిక్కెవరో..?
ఒకప్పుడంటే పప్పు.. అదీ ఇదీ అన్నారు. మరి ఇప్పుడు నారా లోకేష్ నిప్పులా తయారయ్యారు కదా. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. చంద్రబాబు జైలుకెళితే నారా లోకేష్, బాలకృష్ణ వంటి వారంతా ఉన్నారు. మరి వైసీపీకి కష్టమొస్తే ఎవరున్నారు? గతంలో వైసీపీ అధినేత జగన్ జైలుకి వెళ్లిన సమయంలో పార్టీకి అండగా ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ నిలబడ్డారు. షర్మిల అంతే పాదయాత్ర చేసి అన్నను అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు వారిద్దరూ దూరమయ్యారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లే పరిస్థితి మరోసారి వస్తే వైసీపీకి దిక్కెవరు? ఏ నేతను కూడా ఆయన ఎదగనిచ్చిన పాపాన పోలేదే. కూతురు వెళ్లి ఎక్కడో లండన్‌లో ఉంది. చెల్లి, తల్లిని ఆయనే దూరం చేసుకున్నారు. రాజకీయ వారసత్వమంటూ లేదు కదా.
సజ్జలేనా..!?
టీడీపీకి దిక్కెవరూ లేరంటూ ప్రచారం చేస్తున్న వైసీపీకి ఇదిగో మేమున్నామంటూ చెప్పగలిగే సత్తా ఆ పార్టీకి ఉంది. కానీ వైసీపీలో మేము నంబర్-02 అని చెప్పగలిగే సత్తా ఎవరికైనా ఉందా? అసలు అధినేత అయినా ఫలనా వ్యక్తి నా తరువాత అని చెబుతారా? అంత సీన్ ఎప్పటికీ ఉండదేమో. పోనీ నాయకులైనా మేము నంబర్-02.. అని ప్రకటించుకోగలుగుతారా? అంటే ఇది కూడా జరగదు. ఊ అంటే.. ఆ అంటే.. మీడియా ముందుకు వచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా కనీసం తాను నంబర్-02 అని ప్రకటించుకోగలరా? అంటే లేదనే చెప్పాలి. మరి గురివింద మాదిరిగా తమ గురించి తాము తెలుసుకోకుండా ఎదుటి పార్టీకి దిక్కు దివాణం లేదంటూ ప్రచారమెందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మా పార్టీకి దిక్కు ఒకరు కాదు పది మంది ఉన్నారు. మీ పార్టీకి దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు.