ప్రజలకు సేవ చేయడంలో తానెప్పుడూ ముందుంటానని.. అత్యవసర సమయాల్లో వారిని ఆదుకునేందుకు ఎంతటి స్థాయికి వెళ్లేందుకైనా వెనకాడనని చెప్పిన గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు.
సినిమాల్లో తనను ఆదరించి ఉన్నతస్థితికి చేర్చిన ప్రజలపట్ల చిరంజీవి గారు చూపే నిబద్ధత ఇది. ఆయన అభీష్టాన్ని అర్ధం చేసుకుని వెన్నుదన్నుగా నిలిచింది మెగాభిమానులు.
రక్తం అందక ఎవరూ మృతి చెందకూడదనే సదాశయంతో రక్తదానం చేయాలని పిలుపునిచ్చిన చిరంజీవి మాటే శాసనంగా మెగాభిమానులు నిత్యం రక్తదానం చేస్తూనే ఉన్నారు.
అత్యవసర సమయాల్లో ఆదుకునే క్రమంలో ఇప్పటికి లక్షల యూనిట్ల రక్తాన్ని చిరంజీవిగారు ఉచితంగా అందించారు .
అటువంటి ఉదారతనే మరోసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా చేశారు.
పేదరోగుల అవసరార్థం.
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి వారికి 100 యూనిట్స్, గాంధీ ఆసుపత్రి వారికీ 100 యూనిట్స్, నీలోఫర్ ఆసుపత్రికి 100 యూనిట్లు చొప్పున రక్తనిధులు ఉచితంగా పంపించారు.
అలానే.. వరంగల్ లో చికిత్స పొందుతున్న పేద రోగులకు 100 యూనిట్స్, మహబూబ్ నగర్ లో చికిత్స పొందుతున్న పేద రోగుల అవసరార్ధం 100 యూనిట్స్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం నిధులను చిరంజీవి బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి గారి ఆధ్వర్యంలో పంపించారు.
అభిమానులు చేసే ఈ రక్తదానం ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని.. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి అండగా నిలిచిన అభిమానులను రక్తదాతలను డాక్టర్ మాధవి గారు ప్రశంసించారు.