స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఇప్పుడిది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ విదేశాల్లో చర్చనీయాంశమైంది. ఇందులో అక్రమాలు జరిగాయని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారి తెలుగు ప్రజలు భగ్గుమన్నారు. వారం రోజులుగా అటు ఆంధ్రా.. ఇటు తెలంగాణలో నిరసనలు, ధర్నాలతో పరిస్థితులు భగ్గుమన్నాయి. ఓ వైపు సీఐడీ ఇందులో కుంభకోణం జరిగిందని చెబుతుంటే.. అసలు ఇందులో నిజానిజాలెంత అనే దానిపై సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ మీడియా మీట్ పెట్టారు. ఈ కేసు నిరాధారమైందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరిగిన పరిణామాలపై నేడు ఆయన ఒక ప్రముఖ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. అసలు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతే జరగలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు 100 శాతం సక్సెస్ అని వెల్లడించారు. 2021లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని సుమన్ బోస్ తెలిపారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
అసలేం జరిగింది..?
2014లో రాష్ట్ర విభజన జరిగిందని.. ఆ సమయంలోనే ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకురావాలని డిసైడ్ అయిన చంద్రబాబు ముందుగా ఐటీ అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను తీసుకొచ్చారని సుమన్ బోస్ వెల్లడించారు. ఆ సమయంలో 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2021 నాటికి 2.32లక్షల మంది నైపుణ్యం సాధించారని తెలిపారు. వారికి సర్టిఫికేషన్ ఇవ్వడంతో వారంతా ఉద్యోగాలు చేస్తున్నారని సుమన్ బోస్ తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. గతంలో మెచ్చుకున్న ఏపీఎస్‌ఎస్‌డీసీ (ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్).. ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించిందన్నారు.
ఇప్పుడు జగన్ పరిస్థితేంటి..?
ఒక్క కేంద్రాన్నీ సందర్శించకుండానే.. తనిఖీలు నిర్వహించకుండానే అక్రమాలు జరిగాయన్నారని సుమన్ బోస్ తెలిపారు. అసలు ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ అని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఎక్కడా కూడా అవినీతి, మనీలాండరింగ్ జరగలేదని స్పష్టం చేశారు. సీమెన్స్ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి మధ్య ఒప్పందం ఉందని తెలిపారు. ముందుగా తాము అన్నీ అధ్యయనం చేసిన ఈ ప్రాజెక్టును ప్రారంభించామని.. అది కాస్తా సక్సెస్ అయ్యిందన్నారు. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు. కనీసం ఒక్క ఆధారం కూడా చూపించకుండానే బోగస్ ఆరోపణలన్నీ సీమెన్స్‌పై చేస్తున్నారని సుమన్ బోస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు అక్కడే మాట్లాడుతామన్నారు. మొత్తానికి చూస్తే.. ఈ స్కిల్ వ్యవహారంలో ఉండే కంపెనీ మాజీ ఉద్యోగులే.. అప్పుడేం జరిగిందనేది చెప్పేశారు. ఇంత జరిగిన తర్వాత జగన్ ఏం చేయబోతున్నారు..? ఆయన పరిస్థితేంటన్నది అర్థం కావట్లేదు.