టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వారం రోజులుగా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. ఇక ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రోడ్లెక్కారు. చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం (We Stand with CBN) అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఉద్యోగంలో నుంచి తీసేసినా కూడా ఏమాత్రం అదరకుండా.. బెదరకుండా చంద్రబాబు కోసం నిరసనలు తెలియజేస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో అయితే ఎక్కడ చూసినా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించింది లేదు. అసలు ఎన్టీఆర్ ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీడీపీ నేతలు సైతం ఎన్టీఆర్‌ను చాలా లైట్ తీసుకున్నారు. కానీ కొందరు అభిమానులు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్‌కు పేరు మార్చుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యుడిగా గౌరవిస్తుంటే ఎన్టీఆర్ ఆ గౌరవాన్ని నిలుపుకునేలా కనిపించడం లేదని అంటున్నారు. ఇంటి ఆడపడుచుకు కష్టం వస్తే ఏదో ఒక వీడియో విడుదల చేసి ఊరుకోవడంపై మండిపడుతున్నారు.
పార్టీకి కష్టమొస్తే వచ్చి నిలబడతానని చెప్పిన తారక్.. ఇప్పుడు ఇంత కష్టమొస్తే సైలెంట్‌గా ఉండిపోవడంతో ఆయనపై ప్రేమను చంపేసుకుంటున్నామని.. నువ్వు చల్లగా ఉండాలంటూ తమ పోస్టుల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ మావాడే కానీ మాలో ఎప్పటికీ ఒకడివి కాలేవు అని తెగేసి చెబుతున్నారు. తారకరత్న తన చివరి రోజుల్లో పార్టీకి ఎంత అండగా ఉన్నారో గుర్తు చేసుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ మాత్రం అలా దూరంగా ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక దుబాయ్‌లో సైతం ఎన్టీఆర్ తన ప్రతి కష్టంలో అండగా ఉన్నారంటూ ఫ్యాన్స్‌ను పొగిడేసి ఊరుకున్నారు. అసలు పార్టీ ఇంత కష్టంలో ఉంటే.. దుబాయ్ వెళ్లడమే కొందరు క్యాడర్ జీర్ణించుకోలేకపోన్నారు. మొత్తానికి టీడీపీకి ప్రస్తుత తరుణంలో ఎన్టీఆర్ అండగా నిలవకపోవడంతో ఆయన చాలా మంది ఫ్యాన్స్‌కు దూరమవుతున్నారనడంలో సందేహం లేదు.