టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారిగా సీఎం జగన్ స్పందించారు. నేడు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కాపు నేస్తం సభలో జగన్ మాట్లాడుతూ.. ఎన్ని మోసాలు, దొంగతనాలు, వెన్నుపోట్లు పొడిచినా.. ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడిందన్నారు. చట్టం అందరికీ ఒకటే అని చెప్పిన వాళ్లు ఇంత వరకు లేరన్నారు. చంద్రబాబును కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆడియో, వీడియో టేపులతో దొరికినా చంద్రబాబు ఇంకా బుకాయిస్తు్న్నారని జగన్ అన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. చంద్రబాబు తప్పుచేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. అప్పుడు కూడా ఆయన దొంగగా దొరికినా పలుకుబడి కలిగిన ముఠా కాపాడిందన్నారు.
చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పే గళాలు ఇప్పుడు వినబడుతున్నాయని జగన్ అన్నారు. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అనే అయన ప్రశ్నించడం మాని నిస్సిగ్గుగా ఆ పని సబబేనని సపోర్టు చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి చంద్రబాబే స్వయంగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారన్నారు.
ఆ అగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థ చెప్పిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దొంగలను కేంద్ర సంస్థలు అరెస్టు చేశారన్నారు. ఆ స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని సీఎం జగన్ అన్నారు. డబ్బు ఇవ్వొద్దని అధికారులు చెప్పినా 13 సందర్భాల్లో చంద్రబాబు ఒత్తిడి తెచ్చారన్నారు. ఇక ఈ కేసులో చంద్రబాబు పీఏ అడ్డంగా దొరికిపోయాడని జగన్ వెల్లడించారు. ఈమేరకు ఐటీకి చంద్రబాబు పీఏ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు ఆధారాలు చూపి నోటీసులిచ్చారన్నారు. కోర్టుల్లో 10 గంటల పాటు వాదనలు జరిగాయని.. సాక్ష్యాలు, ఆధారాలు చూసి బాబును కోర్టు రిమాండ్‌కు పంపించిందని జగన్ అన్నారు.