టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసింది మొదలు.. ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కంటి నిద్రా లేదు..! టైంకి భోజనం లేదు..! క్షణం కూర్చొన్నది లేదు..! తల్లిని సముదాయించడం.. తండ్రి దగ్గరకు తీసుకెళ్లడం.. ఆపై పార్టీ క్యాడర్‌కు భరోసా ఇవ్వడం.. న్యాయవాదులతో మాట్లాడటం.. వంటి వన్నీ ఒంటి చేత్తో చేసుకొస్తున్నారు నారా లోకేష్.! తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే అక్కడికెళదామంటే పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని గంటల పాటు కింద కూర్చొని మరీ ఆయన న్యాయపోరాటం చేశారు. సెక్షన్లన్నీ వల్లె వేస్తూ పోలీసులను గడగడలాడించారు. తన తండ్రిని చూసేందుకు తనకు రైట్ లేదా? అంటూ పోలీసులను నిలదీశారు. నాన్న కోసం.. నాన్నకు ప్రేమతో నారా లోకేష్ ఒక యుద్ధమే చేస్తున్నారు.
బాడీ షేమింగ్ చేశారు..
పప్పు అన్నారు.. మంగళగిరి కూడా పలకడం రాదంటూ ఎద్దేవా చేశారు.. బాడీ షేమింగ్ చేశారు.. కానీ ఏనాడూ కూడా నారా లోకేష్ భయపడలేదు. అంతకుమించి కృంగిపోలేదు. పైగా ఇప్పుడు పార్టీకి అన్నీ తానే అయ్యారు. నిన్న ఉదయం తండ్రిని కలిసి ఆయనతో మాట్లాడారు. సాయంత్రానికి ఢిల్లీకి బయలు దేరారు. రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. తిరిగి పొద్దుటే పనుల్లో బిజీ అయిపోయారు. జాతీయ మీడియాతో తన తండ్రి అరెస్ట్ విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. అలాగే ఏపీలో తాజా పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించాలనేదే ప్రస్తుతం ఆయన తక్షణ కర్తవ్యం. అలాగే తన తండ్రిపై మోపిన అక్రమ కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించాలి. ఒకవేళ ఏసీబీ కోర్టు, హైకోర్టులలో చంద్రబాబుకు బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టులో టీడీపీ న్యాయ పోరాటం చేయనుంది. దీంతో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలు అపాయిట్మెంట్ ఇస్తే.. ప్రధాని మోదీ, అమిత్ షా.. ఇతరత్రా కేంద్రమంత్రులను కలవబోతున్నారట.
పవన్ తోడవడం బలాన్నిస్తోంది..!
మరోవైపు ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటులో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్షపూరిత ఏపీ రాజకీయాలను చర్చించేలా టీడీపీ ప్లాన్ చేసింది. దీనికోసం పార్టీ ఎంపీలతో నారా లోకేష్ మాట్లాడనున్నారు. మొత్తానికి నారా లోకేష్ తండ్రి కోసం కౌరవ సైన్యం లాంటి వైసీపీతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడవడం చాలా బలాన్నిస్తోంది. వాస్తవానికి నారా లోకేష్ పార్టీకి ఇంత వెన్నుదన్నుగా మారతారని ఎవరూ ఊహించలేదు. కానీ ఆయన బ్లడ్‌లోనే రాజకీయం ఉంది కాబట్టి పెద్దగా సమయం తీసుకోకుండానే పార్టీకి కీలకంగా మారారు. రాష్ట్రమంతా పర్యటించి తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తండ్రి ఎపిసోడ్‌తో జాతీయ స్థాయిలో నారా లోకేష్ హైలైట్ అవుతున్నారు.