టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది. ఇక ఏం మాట్లాడాలో తెలియని వైసీపీ నేతలు చాలా వరకూ సైలెంట్ అయిపోయారు. కొందరు మాత్రం జనాల్లోకి రకరకాల కథనాలను తీసుకెళ్లాలని బీభత్సంగా ప్రయత్నిస్తున్నారు. పొత్తుపై టీడీపీ, జనసేన వర్గాలకు ఓకే నొప్పంతా వైసీపీకే. అందమైన కథలల్లి.. టీడీపీని అనేందుకు ఏమీ లేకుండా జనసేనను టార్గెట్ చేయడం ప్రారంభించాయి. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని.. ఇది ఈనాటి కథ కాదని.. ఏనాటి నుంచో జరుగుతోందని అంటున్నారు. ఇందులో విశేషమేముంది?
లోపాయికారీ ఒప్పందం ఉందట..
ఎప్పటి నుంచో ఇవి రెండు కలిసి పోటీ చేస్తాయని జరుగుతున్న చర్చే ఇది. కొత్తేముంది? ఇప్పుడు అధికారిక ప్రకటన చేశారు. ఎప్పుడో ఒకసారి చేసేదే. అయితే దేనికైనా సందర్భం కావాలి కాబట్టి అది చూసుకుని చేశారంతే. మరో ఆరోపణ ఏంటంటే.. గత ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందట. మరి ఒప్పందం ఉన్నా ఓడిపోయారు కదా. ఇప్పుడు కలిస్తే మాత్రం ఉలుకెందుకు? అప్పటి తమ ఆరోపణలకు నేటి కలయిక నిదర్శనమట. నవ్విపోదురుగాక.. అయితే అప్పటి నుంచి ఈ రెండు పార్టీలపై రాళ్లు వేస్తోందనే కదా దాని అర్థం? అర్థాలు.. పరమార్థాలు వీళ్లకెందుకులే.. విపక్ష పార్టీల గురించి జనాల మెదళ్లలోకి ఏదో ఒక చెడుని జొప్పించాలంతే.
అలా చెప్పడానికి కొలమానం ఏంటి?
జనసేనకు ఒకే ఒక్క నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమేనంటున్నారు. మరి వైసీపీకో? ఆ మాటకొస్తే ప్రాంతీయ పార్టీ దేనికైనా అధినేత ఒక్కరే ఉంటారు కదా? క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి నిర్మాణమే లేదని అంటున్నారు. గత ఎన్నికల్లో అంటే.. ఆ పార్టీ అప్పుడప్పుడే పురుడు పుసుకుంది. అప్పట్లో లేదు. ఇప్పుడు లేదని ఎలా చెబుతారు? అసలు అలా చెప్పడానికి కొలమానం ఏంటి? వైసీపీ నేతలు చేస్తున్న మరో ఆరోపణ ఏంటంటే.. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేదు కాబట్టి జనసేన పార్టీ తరుఫున కూడా టీడీపీ పోటీ చేస్తుందట. కామెడీ అదిరిపోయింది కదా..? అసలు వీళ్లు ఎదుటి పార్టీలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది.
అప్పట్లో చిరుతోనే మాట్లాడటం మానేశారట..
ఇక జనసేన పార్టీ అభ్యర్థులను కూడా టీడీపీ అధినేత చంద్రబాబే డిసైడ్ చేస్తారని మరో అభియోగం. మరి పవన్ ఏం చేస్తారు? గోళ్లు గిల్లుకుంటూ కూర్చొంటారా? ఎదుటి వ్యక్తిని ఇంత దారుణంగా లెక్కగడితే తినబోయే దెబ్బకు కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. ఇక లేటెస్ట్ జోక్ ఏంటో తెలుసా? జనసేనను టీడీపీలో విలీనం చేస్తారట. అసలు మరిచిపోయారేమో.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతోనే పవన్‌కు విపరీతమైన కోపం వచ్చి కొన్నేళ్లపాటు అన్న చిరంజీవితో మాట్లాడటం మానేశారని అప్పట్లో టాక్ నడిచింది. అలాంటిది తన పార్టీని తీసుకెళ్లి టీడీపీలో ఎందుకు విలీనం చేస్తారు? అసలు గత ఎన్నికల్లో ఒకే ఒక సీటు వచ్చింది. పైగా పవన్ సైతం తను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడారు. అప్పుడే ఆయన తన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయలేదు. ఇప్పుడు ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ తన పార్టీని చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు. ఈ సమయంలో వేరొక పార్టీలో విలీనం చేస్తారంటే.. నమ్మడానికి జనం అంత పిచ్చోళ్లు కాదు.