పవన్ మాటతో ఏపీలో సీన్ పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకూ పొత్తు ఉంటుందన్న విషయం తెలుసు కానీ... ఏదో మూల చిన్న సంశయం.. నిన్నటితో పొత్తు ప్రకటన అధికారికంగా వచ్చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేతను కలిసి సైలెంట్‌గా వెళ్లిపోతారనుకుంటే.. సంచలనానికి తెరదీశారు. ఒక్కసారిలో ఏపీలో పొలిటికల్ హీట్‌ను రాజేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. వైసీపీ వారి గుండెల్లో డైనమేట్ పేల్చారు. ఇక మూడు పార్టీలు ముచ్చటగా కలిసి ముందుకు వెళ్లనున్నాయి. ఏపీ ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న ఈ పొత్తు నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి..
చంద్రబాబుతో 40 నిమిషాల పాటు పవన్ భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి పొత్తు ప్రకటన చేసి ఆపై ఏకంగా సీఎం జగన్‌ను ఏకి పారేశారు. అయితే పొత్తు ప్రకటన అనేది కాస్త జనసేన శ్రేణులకు ఆయన ప్రకటన ఒకింత ఇబ్బంది కలిగించి ఉండొచ్చు కానీ.. ఈ సమయంలో ఇదే సరైన నిర్ణయని ఆయన ఇచ్చిన పిలుపును కార్యకర్తలు, నాయకులు ఏకీభవించారు.. అర్థం చేసుకున్నారు..నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఊటంకిస్తూ పవన్ సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానాలుండవ్.. ఇవ్వగలిగే ధైర్యాలు ఏ నాయకుడికీ ఉండవ్.. పవన్ చెప్పింది అక్షర సత్యమే. ఈ రోజు వరకూ సీఎం జగన్ మీడియాను ఫేస్ చేసింది లేదు. ఇక సింహం సింగిల్‌గా వస్తుందంటూ జగన్ పార్టీ పలుకుతున్న చిలక పలుకలకు పవన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
జగన్ సింహం కాబట్టి సింగిల్ గానే రమ్మనండి.. మేము మనుషులం మాత్రమే.. జంతువులం కాదని పవన్ దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఇక పొత్తు విషయం జనసేన శ్రేణులకు అంతో ఇంతో ఇబ్బంది కలిగించినా కూడా ఆ తరువాత ఒకసారి జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుని ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జనసేన కార్యకర్తలకు , నాయకులకు ఊపిరినిచ్చేది.. స్పూర్తినిచ్చింది ఏంటంటే.. కారాగారం బయటే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ వాహనాలను నిలిపేసిన అధికారులు.. పవన్ వాహనాన్ని మాత్రం లోపలికి అనుమతించడం ఆసక్తిని రేకెత్తించింది. ఓవైపు బాలయ్య.. మరోవైపు లోకేష్ నిలబడగా.. మధ్యలో నిలబడి పవన్ కల్యాణ్ మార్కుతోనే ములాఖత్ తర్వాత అభిప్రాయాలను వ్యక్తీకరించడం.. నిర్ణయాలను తెలపడం జనసేన శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు.. పవన్ మాటలకు బాలయ్య, లోకేష్ క్లాప్స్ కొట్టడం.. వారి సంతోషాన్ని రెట్టింపు చేసింది. కానీ మున్ముందు కూడా ఇలాగే కలిసుంటారా..? ఇదే పోరాట పటిమ చూపిస్తారా..? సంక్షేమాన్ని కోరుకునే నేతల పిలుపును అందుకుని స్వాగతిస్తారా ..? అనేది తెలియాల్సి ఉంది.