ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో సినీ ఇండస్ట్రీ ఎందుకు స్పందించడం లేదన్నది హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఏ ఇండస్ట్రీ అయినా కూడా ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. దీనికి సినీ ఇండస్ట్రీ ఏమీ అతీతం కాదు. ప్రభుత్వానికి ఎదురెళితే ఎంత పెద్ద నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అయినా కూడా ఒకింత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వారి సినిమా విడుదలైనప్పుడు టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం తన సత్తా చూపిస్తుంది. టికెట్ రేట్లు సరిగా లేవంటే ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఢమాలే.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వెళ్లడం లేదు. అంతేకాకుండా.. అటు ‘మా’ ఎన్నికల్లో మంచు కుటుంబానికి జగన్ ప్రభుత్వం తన సహాయ సహకారాలు అందించిందని టాక్. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌కు ఎదురయ్యే ఛాన్సే లేదు. ఇక మెగా ఫ్యామిలీ.. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన సమయం దొరికితే చాలు.. ప్రరభుత్వంపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుకు పెద్ద ఎత్తున సపోర్ట్‌గా నిలిచి ఒకరకంగా జగన్‌కు ఆయన టార్గెట్ అయ్యారు.
ఇండస్ట్రీలోనే పెద్ద ఎత్తున హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే వచ్చారు. ఇప్పటికే సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు తగ్గించి జగన్ వారిని కొంత ఇబ్బందులకు గురి చేశారు. పైగా మెగాస్టార్ చిరంజీవి ఏదో అన్నారని మంత్రులంతా కలిసి ఆయనపై మూకుమ్మడి దాడి చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడారు. కాబట్టి ఇక జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడి మరోసారి టార్గెట్ అవలేక మెగా ఫ్యామిలీ మొత్తం కామ్. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు.. పైగా చంద్రబాబుకు స్వయానా వియ్యంకులు కాబట్టి ఆయన చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఇక నాగార్జున ఎప్పుడూ జగన్‌కు అనుకూలమే కాబట్టి ఆయన మాట్లాడరు.