కంస సంహారానికి అంకురార్పణ జరిగింది జైల్లోనే అనే విషయం భారతీయులు ప్రతి ఒక్కరికీ తెలిసిన పురాణమే.! ప్రస్తుతం ఏపీలో కూడా వైసీపీ సంహారానికి జైల్లో అంకురార్పణ జరిగింది.! స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. నేడు చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జైలుకి వెళ్లి కలిశారు. అనంతరం బయటకు వచ్చి పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. ఇక తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి పవన్ ఏపీలో పొలిటికల్ హీట్ బీభత్సంగా రాజేశారు.
టీడీపీకి ఓటు బ్యాంకు పెరగడం ఖాయం
ఒకే ఒక్క ప్రకటనతో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొత్తుపై ప్రకటన వచ్చేసింది. ఇక మీదట ఉమ్మడిగా పోరుకు దిగడం ఖాయమైపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయకపోవడంతో ఓట్లు చీలి వైసీపీకి చాలా ప్లస్ అయ్యింది. ఈసారి ఓట్లు చీలనివ్వబోనని పవన్ శపథం చేశారు. మరోవైపు ఒక్క అరెస్ట్‌తో చంద్రబాబు మైలేజ్ బీభత్సంగా పెరిగింది. టీడీపీకి ఓటు బ్యాంకు పెరగడం ఖాయం. అసలు ఇటీవల వచ్చిన ఓ సర్వే కూడా టీడీపీ సింగిల్‌గా పోటీ చేస్తేనే.. ఏపీలో అధికారం దక్కించుకోవడం ఖాయమని చెప్పింది. ఇక అలాంటిది జనసేన కూడా తోడవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలను అందుకోవడం వైసీపీకి కష్టమే. అసలే మంత్రులపై మాటల్లో చెప్పలేనంత వ్యతిరేకత. పైగా ఒకరిని తొక్కేందుకు మరొకరు యత్నిస్తున్నారు.
అలా జరిగితే బీజేపీకి పవన్ దూరమవుతారా..?
ఈ క్రమంలో టీడీపీ, జనసేన పొత్తు అంటే వైసీపీకి చుక్కలే. ఇక ఈ రెండు పార్టీలకూ బీజేపీ కూడా తోడైతే..కేంద్రంలో వైసీపీకి సపోర్ట్ కూడా పోతుంది. ఇక తలకిందులుగా తపస్సు చేసినా విజయం సాధించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీ అంగీకరించకుంటే పవన్ కమలం పార్టీకి దూరమవుతారా.. లేదా? మొత్తానికి పవన్ అయితే ఒకే ఒక్క ప్రకటనతో లెక్కలన్నీ మార్చేశారు. ఏపీలో 2024 ఎన్నికలకు ఆరు నెలల సమయమే ఉంది. దీంతో జగన్ పార్టీలో వణుకు మొదలైంది. చంద్రబాబుపై అక్రమ కేసుల బనాయించినా కూడా అది ఆయనకే ప్లస్ అవడంతో జగన్‌కు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలోఉన్నారని సమాచారం. ఈ సమయంలో చంద్రబాబు జైల్లో ఉండగానే ముందస్తుకు వెళ్లాలని పవన్ యోచిస్తున్నారట. ఇదే జరిగితే వైసీపీ మరింత నష్టపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి చూస్తే.. 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని టీడీపీ, జనసేన శ్రేణులు ధీమాగా ఉన్నాయ్.. ఏం జరుగుతుందో చూడాలి మరి.